బడంగ్‌పేట, జూలై 8 : అన్ని మతాల సారం మానవత్వం ఒకటేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్ 6వ వార్డు ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో క్రైస్తవ సమాదుల తోటను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎస్ఎస్ఆర్ గార్డెన్లో జరిగిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న జీసస్ బోధనలు గొప్పవని.. బోధనలతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటుందన్నారు. అన్ని మతాల సారం మానవత్వమే అని ప్రపంచ శాంతి కోసం ప్రార్థించటం గొప్ప విషయమన్నారు. మహేశ్వరంలో సమాధుల తోటకు స్థలం కోసం తీవ్రంగా శ్రమించి నేడు క్రైస్తవ సోదరుల సమాధుల తోటను ప్రారంభించుకున్నట్లు తెలిపారు. అదే విధంగా నియోజకవర్గంలోని ఆర్కేపురం, సరూర్‌నగర్ వాసుల కోసం ఎల్బీనగర్లో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా 12వేల గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలు నిర్మించి చివరి మజిలీ ప్రశాంతంగా జరగటానికి కృషి చేసిందన్నారు. క్రిస్టియన్ మైనార్టీల ఆత్మగౌరవం పెంపొందించేలా 2 ఎకరాల స్థలంలో రూ.10కోట్లతో ఉప్పల్ భగాయత్‌లో క్రిస్టియన్ భవనం నిర్మిస్తున్నామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కూడా క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. క్రిస్టియన్ నిరుద్యోగులకు డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద కార్ల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ.20లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కృషి చేస్తోందని క్రిస్టియన్లందరూ గుర్తించి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కార్తీక్‌రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం
కందుకూరు, జూలై 8 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నుట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అగర్మియగూడ గ్రామానికి చెందిన అమృతమ్మకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.55వేల సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కును శనివారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవడానికి ప్రభత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేస్తుందని చెప్పారు. సీఎం రీలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్‌రెడ్డి, లిక్కి జంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.