
బడంగ్‌పేట,జూన్27: మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఫరిధిలో దవాఖాన ఏర్పాటు చేయబోతున్నామని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ పరిధిలోని సుమిత్ర ఎన్క్లేవ్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దవాఖాన ఏర్పా టు చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందని అన్నారు. మీర్‌పేట కార్పొరేషన్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. మూడు చెరువులను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అవసరమైన నిధులు కేటాయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మీర్‌పేట పెద్ద చెరువు అభివృద్ధికి రూ.9కోట్లు మంజూరు చేసిన్నట్లు చెప్పారు. సందచెరువు సుందరీకరణ పనులు పూర్తి కావస్తున్నాయని అన్నారు.
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న 40 చెరువులను అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తున్న క్రమంలో కరోనా విరుచుక పడుతున్నదని అన్నారు. అయినా కూడా అభివృద్ధి ఆపడం లేదని, కొవిడ్ జాగ్రతలు తీసుకొని అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పా రు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చడానికి కోటి రూపాయలను కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు ఆదేశాలు జారిచేశామని అన్నారు. వానకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నాలాలను శుభ్రం చేయాలని అధికారుకు ఆదేశాలు జారిచేశామన్నారు.
విపత్కాల సమయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని, ప్రజలకు ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. చెరువు చుట్టూ ట్రంక్ లైన్ పనులు పూర్తి చేశామని అన్నారు. జీహెచ్ఎంసీకి నిధులు ఎలా కేటాయిస్తున్నారో మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు అదే విధంగా నిధులు ఇస్తున్నారని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్స్ బీరప్ప, మేకల రవీందర్‌రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, అనిల్ కుమార్ యాదవ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.