సుల్తాన్‌బజార్,ఆగస్టు 12: గ్రంథాలయ రంగానికి మొట్టమొదట పంచసూత్రాలను ప్రతిపాదించి,తనదైన పరిభాషను సృష్టించిన గొప్ప వ్యక్తి షియాలి రామామృత రంగనాథన్ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొనియాడారు. గురువారం అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయంలో మొట్టమొదటి గ్రంథపాలకుడు ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మంత్రి గ్రంథాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పురాతన పుస్తకాల ప్రదన్శనను తిలకించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్,ఓయూ గ్రంథాలయ శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఏఏఎం రాజు,డాక్టర్ సుదర్శన్‌రావు,అడపా సత్యనారాయణ,వేగోని రవికుమార్,ఉదయవర్లు,దీక్షిత్,టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ,పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు శ్రీనివాసాచారి,జిల్లా గ్రంథాలయ సంస్థ మేడ్చల్ అధ్యక్షుడు పాండు రంగారెడ్డి,నగర గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు ప్రసన్నారాంమ్మూర్తి,రాష్ట్ర,కేంద్ర గ్రంథాలయ ముఖ్య గ్రంథపాలకులు వెంకటనర్సింహరాజు పాల్గొన్నారు.
బేగంపేట్ ఆగస్టు 12: బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాలను ఈనెల 21న కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రధానచార్యులు డాక్టర్ కె.పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల ప్రారంభించి 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సరం పాటు ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. ఆగస్టు 21న 1971 నుంచి 1995 వరకు చదివిన పూర్వవిద్యార్థుల సమ్మేళనం, నవంబర్ 20న 1996 నుంచి 2020 వరకు చదివిన విద్యార్థుల సమ్మేళనం ఉంటుందని చెప్పారు. అనంతరం జనవరి 22వ తేదీ సర్వసభ్య సమావేశం, ఫిబ్రవరి 26న సభ్యుల సౌజన్యంతో చర్చ, జూలైలో స్వర్ణోత్సవ కార్యక్రమ ప్రణాళిక, తిరిగి 2022 ఆగస్టు వరకు స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాలకు పూర్వ విద్యార్థులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.