పహాడీషరీఫ్, ఆగస్టు 12 : నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి కుమార్ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కేంద్రంలోని మరాఠా ఫంక్షన్హాల్లో జాబ్‌మేళా నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ మేళాల్లో దాదాపు 20 కంపెనీల వరకు పాల్గొన్నాయి. ఈ ఇంటర్వ్యూకు 942 మంది 796 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారికి మంత్రి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత 6 ఏండ్లలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 15వేల కంపెనీలను తీసుకొచ్చి సుమారు 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో గత వారం రోజుల్లో సుమారుగా 1480 మంది జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీడీ డీఆర్డీఏ ప్రభాకర్, జేడీఎం హమీద్, మేనేజర్ క్రాంతి కుమార్, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్భాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, కౌన్సిలర్లు బుడుమాల యాదగిరి, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్ పాల్గొన్నారు.