బడంగ్‌పేట, ఆగస్టు11 : చెరువులను సుందరీకరణ చేయకుండా కొంత మంది రాజకీయ నాయకులు అడ్డు పడుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మీర్‌పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీర్‌పేట పెద్ద చెరువును నూతన హంగులతో అభివృద్ధి చేయడానికి రూ.6.20 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. చెరువులను ఎలా అభివృద్ధి చేయాలో సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. నాయకులు ఎవరైనా రాజకీయాలను కలుషితం చేయకూడదని మంత్రి సూచించారు. బాలాపూర్ మండలంలో ఉన్న 62 గోలుసు కట్టు చెరువులను పూర్వీకులు మనకు అందించారని గుర్తు చేశారు.
అలాంటి చెరువులను భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే చాలా చెరువులు కబ్జా అయిన్నట్లు పేర్కొన్నారు. ఉన్న వాటిని సంరక్షించి అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. సుందరీకరణ పేరుతో చెరువులు కబ్జా అవుతున్నట్లు అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని అన్నారు. చెరువులను సుందరీకరించి భవిష్యత్ తరాలకు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. చెరువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. అవసరం అయిన నిధులు కేటాయిస్తున్నందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చెరువులు కలుషితం కాకుండా ఉండటానికి రూ.23 కోట్లతో ట్రంక్‌లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వర్షం నీటిని ట్రంక్‌లైన్‌లో కలుపవద్దని ఆమె అధికారులకు సూచించారు. ఇటీవల బీఎన్‌రెడ్డి నుంచి మరో ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.23 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. చెరువుల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ముంపు సమస్య రాకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. బాలాపూర్‌లో ఉన్న చెరువులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. జల్పల్లి పెద్ద చెరువును రూ.9 కోట్లతో సుందరీకరణ చేస్తున్నామన్నారు. జిల్లెలగూడ సందచెరువు రూ.6 కోట్లతో, అల్మాస్గూడ పోచ్చమ్మ కుంట రూ.1కోటి, కోమటి కుంటకు రూ.1కోటి, బాలాపూర్ పెద్ద చెరువుకు రూ.1 కోటి, నాదర్గుల్కు రూ.1కోటి నిధులతో అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయడం తగదన్నారు.
అభివృద్ధికి సహకరించాలన్నారు. అందరు సహకరిస్తే చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామన్నారు. చెరువుల చట్టూ గ్రీనరీ, పార్కులు, యోగా కేంద్రాలు, చిల్డ్రన్ పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయిస్తామన్నారు. విషయం తెలుసుకోకుండా ఎవరైనా అవాక్లు చవాక్లు చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. భవిష్యత్ తరాల కోసం చెరువులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తాసీల్దార్, ఇన్చార్జి కమిషనర్ డి.శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎండీఏ ఎస్ఈ హుసేన్, ఈఈ రమేశ్, డీఈ ధన్మోహన్, స్థానిక కార్పొరేటర్లు ధనలక్ష్మీరాజు, అరుణ ప్రభాకర్‌రెడ్డి, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య బీరప్ప, హెచ్ఎండీఏ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.