బడంగ్‌పేట, సెప్టెంబర్ 24 : నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో గతంలో చేసిన వాగ్ధానాలతో పాటు కొత్త వాటిని కూడా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ.12.8 కోట్లతో 43 అభివృద్ధి పనులు, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ.5.92 కోట్లతో 27 అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. సంక్షేమం-అభివృద్ధే, నినాదంగా మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని మరొకసారి ఆశీర్వదించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా జంట కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 100 కోట్ల నిధులు విడుదల చేశారని తెలిపారు. వాటిలో ఒక్కరోజే రూ. 18 కోట్లకు సంబంధించి పనులను ప్రారంభించామని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశం మెచ్చే విధంగా పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గానికి మెడికల్ కళశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, వాణీదేవి, బడంగ్‌పేట, మీర్‌పేట మేయర్లు చిగిరింత నర్సింహారెడ్డి, దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు, కో -ఆప్షన్ మెంబర్లు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.