బడంగ్‌పేట, ఆగస్టు 10 : తుక్కుగూడ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం తుక్కుగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ మధుమోహన్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.148 కోట్లు, తుక్కుగూడ మున్సిపాలిటీకి రూ.26 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటికే రూ.4కోట్లు తీసుకురావడం జరిగిందన్నారు. విద్యుత్ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని మంత్రి సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రీన్ బడ్జెట్ కోసం ప్రభుత్వం పదిశాతం నిధులు కేటాయించిండంతోపాటు మున్సిపాలిటీలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి అధికారులు చొరవ చూపాలని, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారాన్ని విస్మరిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్స్, అధికారులు పాల్గొన్నారు.