
బడంగ్‌పేట, జూలై 4 : ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పట్టణప్రగతి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. 9,10,12,14వ వా ర్డులో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పైపులైన్, వరద నీటి కాల్వలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ తుక్కుగూడగా మా ర్చడానికి ప్రతి పౌరుడి సహకారం అవసరం అన్నారు. ప్రజల సంపూర్ణ సహకారంతో పట్టణ ప్రగతికి సార్ధకత లభిస్తుందన్నారు. భవిష్యత్‌లో చెత్త సమస్య రాకుండా ఉం డటానికి తుక్కుగూడలో మూడు చెత్త డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గ్రామానికి నా లుగు వైపులా వైకుం ఠ ధామాలు ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా ఇంటి వద్దకు వస్తున్న చెత్త రిక్షాలో వేయాలని సూచించారు.
తుక్కుగూడ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ ఏర్పాటు కోసం రూ. 4.5కోట్లు మంజూరు చేశామన్నారు. ఇతర గ్రామాల నుంచి వస్తున్న ప్రజలకు అన్ని ఒకే చోట లభించే విధంగా చూడాలని ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్‌ను ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. వైకుంఠధామాల కోసం రూ. కోటీ కేటాయించమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీవెంకట్రెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.
పహాడీషరీఫ్, జూలై 4 : భవిష్యత్ తరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఇంటి పరిసరాలు, కాలనీల్లో విరివిగా మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించుకుందామని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆమె జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 17,18, 19 వార్డుల్లో పట్టణప్రగతి, హరితహారంలో భాగంగా పర్యటించారు. అనంతరం సమస్యలను తెలుసుకుని, బురాన్‌ఖాన్ చెరువు కట్ట అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యంతో పాటు పచ్చదనానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెల జల్పల్లి మున్సిపాలిటీకి రూ. 48లక్షలు నిధులు వస్తున్నాయన్నారు. ఇందులో 10శాతం నిధులు పచ్చదనం కోసం ఖర్చు చేయాలన్నారు. విద్యుత్ సమస్యలన్నింటినీ పట్టణ ప్రగతిలో పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చెరువుల సుందరీకరణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జల్పల్లి పెద్ద చెరువు సుందరీకరణకు ఇప్పటికే రూ. 9 కోట్లు కేటాయించామన్నారు. ఉస్మాన్‌నగర్ చెరువు కట్టను రూ. 30లక్షల నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. చెరువులోకి డ్రైనేజీ రాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ విశ్వేశ్వరరావు, ఏఈ కిష్టయ్య, కౌన్సిలర్లు మజర్అలీ, శంషోద్దీన్, నాయకులు యంజాల జనార్దన్, షేక్అప్జల్, మాజీ సైనికుడు వాసుబాబు, నిరంజన్, దూడల సుధాకర్‌గౌడ్ పాల్గొన్నారు.
మహేశ్వరం,జూలై 4 : తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాయని తుమ్ములూరు సర్పంచ్ మద్దిసురేఖ కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో పల్లెప్రగతిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి స్వచ్ఛ గ్రామంపై అవగాహన కల్పించారు. తుమ్ములూరు గ్రామం పల్లెప్రగతిలో అన్ని వార్డుల్లో పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్ వార్డు సభ్యులు కటికెల శ్రీహరి, శ్రీధర్‌రెడ్డి, చంద్రయ్య, రేఖ, పద్మ పాల్గొన్నారు.
బడంగ్‌పేట, జూన్ 4 : ప్రతి ఇంటిలో ఆరు మొక్కలు నాటాలని మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్ అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 15, 28,29 డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. హరితహారం కార్యక్రమంలో కాలనీవాసులు భాగస్వాములు కావాలని ఆమె అన్నారు. కార్పొరేటర్లు, కమిషనర్ సుమన్రావుతో కలిసి మొక్కలు నాటారు. కాలనీల్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అరుణా ప్రభాకర్‌రెడ్డి, నీలా రవినాయక్, కర్ణానిధి, కాలనీ వాసులు ఉన్నారు.