సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ ): ముందస్తు వర్షాల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హైదరబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో బుధవారం వర్షాకాల ప్రణాళిక -90 రోజుల కార్యచరణ, పురోగతిలో ఉన్న పలు ప్రాజెక్టు పనులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో డైరెక్టర్లు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన శుద్ధిచేసిన నీటిని సరఫరా చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు.
జలమండలి ఆర్థిక పరిస్థితిపై ఆరాతీసిన మంత్రి రెవెన్యూ పెంచుకోవడానికి, నీటి వృధాను అరికట్టడానికి, లీకేజీలను అరికట్టడానికి, ప్రజలలో నీటి వృథా తగ్గించేలా అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి, కోర్ సిటీ సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, ట్రాన్స్మిషన్ అధికారులు పాల్గొన్నారు.
చేపమందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్8న జరిగే చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదంపై ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీకి పోలీసులు పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఏర్పాటు చేసినట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. మత్య్సశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, బత్తిని కుటుంబ సభ్యులు బత్తిని అమరనాథ్ గౌడ్ , గౌరీ శంకర్ , చంద్రశేఖర్ ,శివ శంకర్, సంతోష్, అధికారులు పాల్గొన్నారు.