Minister Ponnam | సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 ( నమస్తే తెలంగాణ ) : గణేశ్ నిమజ్జనోత్సవం శాంతియుత వాతావరణంలో విజయవంతమయ్యేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ అనుదీప్, నగర సీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 17న నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగేలా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జనంలో ఎక్కడైనా సమస్యలుంటే పోలీసు, రెవెన్యూ శాఖలకు తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిటీ సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. నిమజ్జన వేడుకల్లో 15 వేల మంది, ఇతర జిల్లాల నుంచి 3 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. మరో 8వేల మంది విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాలతో ట్యాంక్‌బండ్ వైపు విగ్రహాల నిమజ్జనానికి అనుమతించకుండా పోలీసులు నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపునే ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ శోభాయాత్ర సాఫీగా నిర్వహించడంలో భాగంగా ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జోన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిమజ్జనానికి 18 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంతో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నుంచి ట్యాంక్‌బండ్‌కు గతంలో భారీ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చేవి. అయితే హైకోర్టు ఆదేశాలతో ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలను నిమజ్జనానికి పోలీసులు ఎంట్రీ ఇవ్వకుండా నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
నిమజ్జనం రోజు ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఆ విభాగం చర్యలు చేపట్టింది. ఏఏ రూట్లలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్తాయనే విషయంపై అధికారులు జాబితా తయారు చేస్తున్నారు. శోభాయాత్ర రోజు మధ్యాహ్నం నుంచి నిమజ్జనాలకు తరలివచ్చే వాహనాల సంఖ్య పెరుగుతూ.. రాత్రి వరకు భారీ సంఖ్యలో వచ్చేస్తాయి. ఈ నేపథ్యంలోనే అఫ్జల్‌గంజ్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ప్రధాన రహదారి అంతా కేవలం విగ్రహాలతో తరలివెళ్లే వాహనాలకే అనుమతిస్తారు.
సామాన్య ప్రజలు తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ కింద నుంచి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా నిమజ్జనానికి తరలివెళ్లే వాహనాలు, సామాన్య ప్రజలు, భక్తులతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ సాఫీగా వాహనాలను వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు పక్కా ప్లాన్‌తో పనిచేయాల్సిన అవసరముంటుంది. ఇక్కడ సమస్య తలెత్తితే నగరవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలోనే నిమజ్జనం సాఫీగా సాగేలా..వివిధ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓలతో ట్రాఫిక్ అదనపు సీపీ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్‌తో సహా సుమారు 62 చెరువులతో పాటు పీవోపీ విగ్రహాల కోసం ప్రత్యేకంగా 73 కొలనులను ఏర్పాటు చేసి.. ఇప్పటికే నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఆరు జోన్ల పరిధిలో స్టాటిక్ క్రేన్లు 21, మొబైల్ క్రేన్లు 295, 213 గణేశ్ యాక్షన్ బృందాలను నియమించారు. అంతేకాకుండా నిమజ్జనం అనంతరం వ్యర్థాలను తరలించేందుకు 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలను సిద్ధంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం 309 మొబైల్ టాయిలెట్లు, 52వేల లైట్లను ఏర్పాటు చేశారు.