సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. సర్వేకు ఆటంకాలు కల్పిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలిసి మంత్రి పొన్నం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 17 లక్షల 44వేల ఇండ్లు సర్వే చేయడానికి 88వేల ఎన్యూమరేటర్లను నియమించినట్లు చెప్పారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇండ్లు కేటాయించినట్లు చెప్పారు. గ్రేటర్లో 29,58,277 ఇండ్ల సర్వేకు 20,920 మంది ఎన్యూమరేటర్లను, 1728 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. అనంతరం ఎన్యుమరేటర్లకు సర్వేకు సంబంధించిన సామగ్రి కిట్లను మంత్రి, అధికారులు పంపిణీ చేశారు. కుటుంబసర్వేకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.