పీర్జాదిగూడ, సెప్టెంబర్ 5: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని, ఉత్తమ సేవలు అందించినప్పుడు ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు లభిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురుపూజోత్సవ వేడుకల్లో భాగం గా పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట కార్పొరేషన్ల ఆధ్వర్యం లో మేడిపల్లిలోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మేయర్ జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్లు శివకుమార్ గౌడ్, కొత్త లక్ష్మీరవిగౌడ్లతో మొదట మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లోని ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. సుమారు 1000 మంది, ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవితకు ఉపాద్యాయులు మార్గదర్శకులని, సామజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని, విద్యను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.