మేడ్చల్ / మేడ్చల్ కలెక్టరేట్, మే 6 : ‘సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి. సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్నారు. పెద్ద కొడుకులా ఆసరా పింఛన్లు, మేనమామలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇస్తున్నారు. రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. ఒక్క నాగారం మున్సిపాలిటీలోనే ఆసరా పింఛన్ల కింద ప్రతి నెలా రూ.51 లక్షలు అందుతున్నాయి. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే’. అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, దేశ ప్రజలు ఇక్కడి మాడల్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
దేశంలోని 15 రాష్ర్టాలకు చెందిన కార్మికులు తెలంగాణకు వచ్చి ఉపాధి పొందుతున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ర్టాలకు చెందిన 25 లక్షల మంది రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నారన్నారు. బీజేపీ మత కల్లోలాను సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలో ఉండగా డంపింగ్ యార్డు రూపేణా పెద్ద దరిద్రాన్ని నాగారం, జవహర్‌నగర్ ప్రజల నెత్తిన పెట్టిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నగరంలోని చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ పారవేయడంతో దుర్వాసనతో ప్రజల సతమతమయ్యేవారన్నారు. ఈ సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి దశల వారీగా పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. తాజాగా భవానీనగర్ నాలా కోసం రూ.8 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడలను రూ. 610 కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేసినట్టు తెలిపారు. రూ.500 కోట్లతో జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు చెత్తతో కరెంట్ తయారు చేస్తున్నామని, రూ.250 కోట్లతో మురికి నీటిని శుద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు 58, 59 జీవో ద్వారా సీఎం కేసీఆర్ న్యాయం చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఒక్క జవహర్‌నగర్ మున్సిపాలిటీలోనే 40వేల మందికి ఉచితంగా పట్టాలు లభించనున్నాయని వెల్లడించారు.
ఆత్మీయ సమ్మేళనంలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన లింగంతో పాటు 50 మంది నాయకులు, కార్యకర్తలు, రాంపల్లి 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో 4వ వార్డుకు చెందిన బీజేపీ నేత లక్ష్మణ్ గౌడ్ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్, వర్కింగ్ అధ్యక్షులు శ్రీనివాస్, కౌన్సిలర్ నాగేశ్ గౌడ్
తదితరులు పాల్గొన్నారు.
నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అన్ని కుల సంఘాలకు న్యాయం చేస్తున్న కేసీఆర్, తాజాగా గౌడ కులస్తులకు రూ.5 లక్షల బీమా అమలుకు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో మేడ్చల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు.