మేడ్చల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్‌లో ఈ నెల 18న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వి కన్వేషన్ సమీపంలో జరుగనున్న సభా స్థలి ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సుమారు 50 ఎకరాల స్థలంలో నిర్వహిస్తున్న సభకు సుమారు 60వేల పైచిలుకు ప్రజలను తరలించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
రానున్న శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు ఇంటి పార్టీగా మార్చుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తీరస్కరిస్తున్నారని, వాళ్లకు ఓట్లు వేస్తే రాష్ట్రం అదోగతి పాలవుతుందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్‌కు ఏం చేశారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి బీఆర్ఎస్ ఇస్తున్న అన్ని పథకాలను నిలిపివేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, తూకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్, మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎంపీపీ రజితరాజమల్లారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్‌యాదవ్, నాయకులు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, దయానంద్‌యాదవ్, శేఖర్‌గౌడ్, మల్లికార్జునస్వామి, భాగ్యారెడ్డి, సర్పంచులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.