కీసర, నవంబర్ 24 : మీ ప్రాంతాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని, మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీసర మండలంలోని అంకిరెడ్డిపల్లి, కీసర గ్రామాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే మన ప్రాంతం అన్ని రంగాల్లో అగ్రగామీగా మారిందని, మన సీఎం కేసీఆర్ అర్హులైన అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసి సక్సెస్ అయ్యాడన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగానే కాకుండా స్వచ్ఛందంగా కూడా కోట్లాది రూపాయలతో గ్రామాల్లో సీసీ రోడ్డులు, ఆలయాల నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రజల కష్టాలు తనకు తెలుసునని, ప్రజలకు ఏం చేయాలో తెలిసిన నాయకుడినని, మీరు ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిచి మళ్లీ మీకందరికి అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. గతంలో కాంగ్రెస్ వాళ్లు మన ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారు. ప్రజలంతా ఓట్ల రూపంలో వారికి తగిన బుద్ది చెప్పాలన్నారు. కబ్జాలు చేసే కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్‌రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, ఎంపీటీసీ తటాకం నారాయణశర్మ, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ, అంకిరెడ్డిపల్లి సర్పంచ్ మోర విమలనాగరాజు, బీఆర్ఎస్ నేతలు బి.రమేశ్‌గుప్త, ఎం. జంగయ్యయాదవ్, రామిడి ప్రభాకర్‌రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.