మేడ్చల్ రూరల్, నవంబర్ 2: కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధికే పట్టం కట్టాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి, ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎవరూ ఊహించిన విధంగా రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని విధాల అభివృద్ధి చేసి, రాష్ర్టాన్ని ఆదర్శంగా మార్చారని తెలిపారు. పదేండ్లలో మేడ్చల్ నియోజకవర్గం అనూహ్య అభివృద్ధి సాధించిందని, అభివృద్ధిలో మున్సిపాలిటీలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నగరంలోని బంజారాహిల్స్లా మారిందన్నారు. పేద ప్రజలను ఆదుకున్న సీఎం కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి, మళ్లీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.