మేడ్చల్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ఢిల్లీని కదిలించి వడ్లు కొనిపిస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని 61 గ్రామపంచాయతీల్లో ఇండ్లపై నల్లా జెండాలు ఎగుర వేసిన రైతులు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. మున్సిపాలిటీల్లో రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఘట్కేసర్ మండలం ఏదులాబాద్లో రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు.
రైతులపై దాడి చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రైతుల పక్షాన పోరాడలేని దద్దమ్మలు రాష్ట్ర బీజేపీ నాయకులని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు దమ్ముంటే అన్యాయానికి గురవుతున్న రైతుల పక్షాన పోరాడాలని, కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా ఒప్పించాలని సూచించారు. రాష్ట్ర రైతుల గొంతుకను కేంద్రానికి వినిపించేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 11న ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు మేడ్చల్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్తున్నట్లు తెలిపారు. ధర్నాలో రైతులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు పాల్గొంటారని చెప్పారు.