సిటీబ్యూరో,మే 8 (నమస్తే తెలంగాణ): ఎమర్జింగ్ టెక్నాలజీస్ (అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం) ను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఒక్కో టెక్నాలజీకి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి, దాని వినియోగం కోసం ప్రభుత్వం ప్రాజెక్టులను రూపొందించి రాష్ట్రంలోని అన్ని రంగాలు, వర్గాల ప్రజలకు సేవలందిస్తోంది. తద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవన విధానాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లేలా చేస్తున్నారు. ఉదాహరణకు డ్రోన్ పాలసీ కింద మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి మందులను అత్యవసర సమయంలో అత్యంత వేగంగా అందించేందుకు డ్రోన్లను రాష్ట్రంలో వినియోగించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక ప్రాజెక్టుగా చేపట్టడంతో ఇది విజయవంతమైంది. ఇలా ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కింద గుర్తించిన 8 టెక్నాలజీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వాటి వినియోగం కోసం ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించి, సమర్థవంతంగా అమలు చేసే పనిలో తెలంగాణ ఐటీ శాఖ నిమగ్నమైంది. 2018 నుంచి ఇప్పటి వరకు 5 ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లు అయిన బ్లాక్ చైన్, డ్రోన్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్, స్పేస్ టెక్‌లకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించింది. తాజాగా రోబోటిక్ టెక్నాలజీకి సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే కసరత్తు పూర్తి కావడంతో దానిని టీ హబ్‌లో మంత్రి కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించనున్నారు.
ఇప్పటి వరకు 5 ఫ్రేమ్‌వర్క్‌లను ఆవిష్కరించాం
ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో మొత్తం 8 టెక్నాలజీస్‌ను గుర్తించాం. ఇప్పటి వరకు 2018లో బ్లాక్ చైన్, 2019లో డ్రోన్‌టెక్, 2020లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 2021లో క్లౌడ్ అడాప్షన్, 2022లో స్పేస్ టెక్ ఫ్రేమ్‌వర్క్‌లను తీసుకొచ్చింది. ఇవన్నీ దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా టెక్నాలజీస్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ ఒక్కో దానికి ప్రత్యేకంగా ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడంతో పాటు వాటి ప్రభుత్వ కార్యకలాపాల్లో సమర్థవంతంగా వినియోగించేలా ఐటీ శాఖ చర్యలు తీసుకుంటోంది. తాజాగా రోబోటిక్స్ టెక్నాలజీ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన రోబోటిక్స్ వినియోగంలో జపాన్, కొరియా దేశాల కంటే మనం వెనకబడి ఉన్నాం. వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు పొందడంలో ఇప్పటికే ఆలస్యం చేశాం. ఇకనుంచైనా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి మన అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్లను రూపొందించాలని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
– రమాదేవి లంక, ఓఎస్డీ, తెలంగాణ ఐటీ శాఖ