కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 8 : ప్రజా సేవలోనే కాదు.. సాటివారికి సాయమందించడంలో తాము ముందుంటామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌లు నిరూపించారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన జన్మదినం సందర్భంగా.. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరుతో సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది పేద ప్రజలకు ఉపయోగపడే అంబులెన్స్‌లను ఇవ్వాలని పిలుపునివ్వగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2 అంబులెన్స్‌లు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ సైతం 2 అంబులెన్స్‌లను సమాజానికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఏడాది దివ్యాంగులకు వాహనాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడంతో.. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ 100 వాహనాలను దివ్యాంగులకు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
దీనిలో భాగంగా ఆదివారం నగరంలోని నెక్లెస్ రోడ్డు జలవిహార్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నవీన్‌కుమార్ గిఫ్ట్‌గా ఇచ్చిన 100 వాహనాలను దివ్యాంగులకు అందజేశారు. ఇదే వేదికపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం తాను దివ్యాంగులకు 100 వాహనాలను ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఇరువురు నేతలను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలు.. కూకట్‌పల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రజలకు దానం చేయడంలో కూడా ఆదర్శవంతంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు పగుడాల శిరీషబాబురావు, మందడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, సబిహాబేగం, ఆవుల రవీందర్‌రెడ్డి, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు..
అల్లాపూర్ , ఆగస్టు 8 : ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద అల్లాపూర్ డివిజన్‌కు చెందిన దివ్యాంగులకు ఆదివారం మంత్రి కేటీఆర్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాహనాలను పంపిణీ చేశారు. కార్పొరేటర్ సబిహాబేగం.. కేటీఆర్ చేతుల మీదుగా మూడుచక్రాల స్కూటర్లను వారికి అందజేశారు . కార్యక్రమంలో మేడ్చెల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు ఐలయ్య, పల్లి తిరుపతి, సంజీవ్, చాంద్, హమీద్, రవీందర్‌రెడ్డి, రఫీక్, సలీమ్, మోయిజ్ పాల్గొన్నారు .