హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి తారకరామారావు ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ.. పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరోక్షంగా బీజేపీ నేతలను ఏకిపారేశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఆవిష్కరించి మా ట్లాడారు. ఆ ప్రసంగంలోని విశేషాలు ఆయన మాటల్లోనే.. ఏ దేవుడు చెప్తున్నాడు కొట్లాడమని? ఏ మతం దేవుడైనా చెప్పిండా? కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? ఏసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? నా మనుషులను భూమి మీదకు పంపిస్తున్నా.. ఎవరి దేవుడు గొప్ప అనే కాంపిటిషన్ పెట్టుకొని తన్నుకోండి అని చెప్పిండా? ఎందుకు.. ఎవరి కోసం కొట్లాడుతున్నం? దేని మీద దృష్టిపెట్టాలి? అసలు దేని మీద పనిచేస్తున్నం? ఈ దేశంలో నీళ్లు లేవని ఒకరు ఏడుస్తున్నరు, తిండి లేక చస్తున్నరు. రాష్ట్రపతి ఊరికి నిన్నగాక మొన్న కరెంట్ వస్తే దాని మీద మనకు సోయిలేదు. ఏ దేవుడు గొప్ప? అని ప్రశ్నించుకొంటున్నరు. నన్నడిగితే మా అమ్మ గొప్ప అని చెప్తా. ఎవరి అమ్మ గొప్ప అనే కాంపిటిషన్‌కు అర్థముంటదా? ఎవరి అమ్మ గొప్ప? ఎవరి దేవుడు గొప్ప? అనే ప్రశ్నకు జవాబు దొరుకుతదా?
మతాల మీద పడి ఎక్కడికో పోతున్నం
మతాల మీద పడి ఎక్కడికో పోతున్నం. చైనా 16 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మనం 3.1 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయాం. సిగ్గుపడాల్సి పరిస్థితి. తెలంగాణ దీనికి భిన్నంగా పనిచేస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రాష్ట్రం సాధించిన విజయాలు, నిధులు అన్నీ మీ ముందున్నాయి. 140 కోట్ల దేశ జనాభాలో మనం 4 కోట్లే. కానీ దేశానికి 5% జీడీపీ సమకూరుస్తున్నం. ఇదీ పురోగతి అంటే. గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలను ప్రజలు అడుగుతారనే వాటిని పక్కదారి పట్టించేందుకు హిజాబ్, హలాల్, మునావర్ పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరు. ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్ చేస్తున్నరు.
బియ్యం, ఉచిత విద్యుత్తు ఇస్తే తప్పా?
మనం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకొంటున్నం. అయినా మన దేశం థర్డ్ వరల్డ్ కంట్రీగానే ఉండటం బాధాకరం. ఇంకా దేశంలోని చాలా మందికి అన్నం దొరక్కపోవడం, విద్య, వైద్యం అందకపోవటం సిగ్గుచేటు. పరిస్థితులేమో ఇలా ఉంటే ‘ప్రజలను సోమరిపోతులను చేస్తున్నరు, ఫ్రీబీస్ ఇస్తున్నరు’ అని డైలాగులు చెప్తున్నరు. కార్పొరేట్లకు కోట్లకు కోట్లుకు మాఫీ చేస్తరు. పేదోడికి లక్ష కోట్లు ఖర్చు చేయలేరా? బియ్యం, ఉచిత విద్యుత్తు ఇస్తే తప్పా?
చెరువు బాగుపడితేనే
తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్ నీళ్లు, నిధులు, నియమకాలు. ఈ మూడింటిని ప్రాధాన్యంగా తీసుకొని ఎనిమిదేండ్లలో ముందుకెళ్లాం. ఈ కాలంలో తెలంగాణ బాగుపడ్డదా? చెడిపోయిందా? అన్నది గణాంకాలే చెప్తాయి. ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పుడు ముస్సోరీలో శిక్షణ పొందుతున్న యువ ఐఏఎస్ అధికారులకు కేస్ స్టడీగా మారింది. చెరువులు బాగు చేసుకోవటం, కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల జిల్లా సుభిక్షమైంది. గతంలో మాదిరి చెరువుల కట్టలు ఇప్పుడు తెగటం లేదు. మిషన్ కాకతీయతో భూగర్భ నీటిమట్టం 6 మీటర్ల మేర పెరిగింది.
రాష్ట్రంలో రెండు జీవనదులతో పాటు, 46 వేల చెరువులు ఉన్నాయి. రాష్ట్రంలోని 46 వేల చెరువులను బాగుచేసుకొంటే నాగార్జునసాగర్ సామర్థ్యమంత నీటిని నిల్వ చేసుకోవచవ్చని సీఎం కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ తరుచూ చెప్పేవారు. అన్నట్టుగానే చెరువులను అభివృద్ధి చేసుకున్నం. తెలంగాణ ఇప్పుడు జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా మారింది. దేశంలో ఇంటింటికీ నీటిని అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సాక్షాత్తు కేంద్ర జల్‌శక్తి శాఖ చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు మనకు గర్వకారణం. శతాబ్దకాలం వరకు హైదరాబాద్‌కు తాగునీరందించే కామధేనువు అది.
పుస్తకాలను డిజిటలైజ్ చేయాలి
2 వేల పేజీలకు పైగా ఉన్న స్టడీ మెటీరియల్‌ను ముద్రించాలంటే వేల చెట్లు నరకాల్సి ఉంటుంది. అందుకే ఆ మెటీరియల్‌ను డిజిటలైజ్ చేయటం ఉత్తమం. యాప్, ట్యాబ్, వెబ్సైట్లలో మెటీరియల్‌ను అందుబాటులోకి తేవాలి. ఇందుకయ్యే ఖర్చును ఐటీ శాఖ భరిస్తుంది. 10 టెరా బైట్స్ సామర్థ్యం గల స్పేస్‌ను ఉచితంగా సమకూరుస్తాం. 5 వేలకు పైగా ఖర్చయ్యే మెటీరియల్‌ను 1,150లకే ఇవ్వటం శుభపరిణామం.
విద్యారంగంలో సమూల మార్పులు: సబిత
గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకే పరిమితమయ్యేవని, కానీ తెలంగాణ సర్కారు అభ్యర్థులను సన్నద్ధం చేసే బాధ్యతలను కూడా స్వీకరించిందని వెల్లడించారు. సీఎం 90 వేల ఉద్యోగాల ప్రకటన చేశాక నియోజకవర్గాల్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ తమకు సూచించారని సబిత గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఓపెన్ యూనివర్సిటీ నాలుగు పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావటం శుభపరిణామమని కొనియాడారు.
లైబ్రరీలకు టిఫ్ ఉచిత మెటీరియల్
బీఆర్‌ఏవోయూ స్టడీ మెటీరియల్‌ను రాష్ట్రంలోని గ్రంథాలయాలకు ఉచితంగా అందజేసేందుకు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) ముందుకొచ్చింది. ఈ మేరకు టిఫ్ అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి రూ.11 లక్షల చెక్కును కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఏవోయూ వీసీ సీతారామారావుకు అందజేశారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం సంఘం అధ్యక్షుడు ఎస్వీసీ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఎక్కల్దేవి పరమేశ్వర్ సైతం సంఘం తరఫున నిరుద్యోగులకు మెటీరియల్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, టీశాట్ సీఈవో శైలేశ్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఓయూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ డీ రవీందర్, ఆర్జీయూకేటీ ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరమణ, బీఆర్‌ఏవోయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏవీఎన్ రెడ్డి, ప్రొఫెసర్ వీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నడ్డా చెప్పులు మోసే గులామ్ ఎవరు? ;మంత్రి కేటీఆర్ ట్వీట్
రాష్ట్ర బీజేపీ నేతలపై మంత్రి కే తారకరామారావు మరోసారి వ్యంగ్యాస్త్రం సంధించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ‘ఈ రోజు జేపీ నడ్డా చెప్పులు మోసే గులామ్ ఎవరు? దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా చెప్పగలను’ అంటూ మంత్రి కేటీఆర్ శనివారం ట్వీట్ చేశారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు అందించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
నూలు వడకటం కాదు..చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి!
కేంద్రమంత్రి గోయల్‌కు కేటీఆర్ చురక ప్రధాని మోదీ నూలు వడకటం కాదు.. చేనేత వస్ర్తాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాట్నంపై ప్రధాని మోదీ నూలు వడుకుతున్న ఫొటోను కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ శనివారం ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ తనదైన శైలిలో రీట్వీట్ చేశారు. ‘మీరు ఏది చేసినా, ఖాదీ, చేనేతపై జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీజీ కాదా? మోదీ చెప్పే మాటలకు చేసే చేతలకు పూర్తి భిన్నంగా ఉంటున్నది నిజం కాదా? ఇది కపటత్వం కాదా? ఇప్పటికైనా చేనేత, ఖాదీపై జీఎస్టీని రద్దు చేసేలా చట్ట సవరణ చేయాలని మోదీకి చెప్పండి’ అని గోయల్‌కు చురక అంటించారు.
కేంద్రం ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వలేదు
తెలంగాణ ఏర్పడ్డాక విద్యారంగంలో భారీ మార్పులొచ్చాయి. రాష్ట్రంలోని 972 గురుకులాల్లో 5 లక్షల మంది చదువుకొంటున్నారు. ఒక్కో విద్యార్థికి 1.2 లక్షలు ఖర్చు చేస్తున్నం. వెటర్నరీ, హార్టికల్చర్ వర్సిటీలను ఏర్పాటు చేసుకొన్నం. ఇటీవలే ఫారెస్ట్, మహిళా వర్సిటీలను క్యాబినెట్ ఆమోదించింది.కానీ, కేంద్రం తెలంగాణకు ఐఐఎం, ఐసర్, ఎన్ఐటీ, నవోదయ విద్యాలయాలు ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదు. 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఇదే.
2.20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నం
ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఉంటది. కానీ ఏ ప్రభుత్వమూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నం. మొదటి దఫా 1.32 లక్షలు, ఈ దఫాలో 90 వేలు.. మొత్తం 2.20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. కేంద్రం దగ్గరే 30 లక్షల ఖాళీలున్నాయి. కానీ కొందరు ఇక్కడికొచ్చి గంభీరమైన మాటలు చెప్తున్నరు.
మనం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకొంటున్నం. అయినా మన దేశం థర్డ్ వరల్డ్ కంట్రీగానే ఉండటం బాధాకరం. ఇంకా దేశంలోని చాలా మందికి అన్నం దొరక్కపోవడం సిగ్గుచేటు. విద్య అందకపోవటం సిగ్గుచేటు. వైద్యం అందకపోవటం సిగ్గుచేటు.
–మంత్రి కేటీఆర్