కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 6 : మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ఏర్పాటుతో నాలాలు, చెరువులలో శుద్ధి అయిన నీరు ప్రవహిస్తున్నదని, ఎస్టీపీలతో భూగర్భ జలాలు కలుషితం కాకుండా పర్యావరణ, ప్రజా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్లో 100 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రం శంకుస్థాపనలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల సాకారంతో కూకట్పల్లి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నదని, వేలాది కోట్ల నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రధాన చెరువుల్లో మురుగునీరు చేరడం వల్ల దుర్వాసనతో పాటు గుర్రపు డెక్క పెరుగుతుందన్నారు. దీంతో దోమలు వృద్ధిచెంది సమీప కాలనీలపై దండయాత్ర చేస్తున్నాయన్నారు. దోమల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రధాన కాలువలు, చెరువులకు అనుబంధంగా ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని సంకల్పించడం గొప్ప విషయమన్నారు. ఎస్టీపీల వ్యవస్థ అందుబాటులోకి వస్తే మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
అదనంగా కాముని, మైసమ్మ చెరువులు, రంగధాముని (ఐడీఎల్), సున్నం చెరువులపై ఎస్టీపీలను ఏర్పాటు చేస్తూ సుందరీకరణకు నిధులు కేటాయించాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు కేటాయించాలని, తాగునీటి సమస్యల పరిష్కారానికి మరో రూ.24 కోట్లు కేటాయించాలని, ఫతేనగర్‌లో ఎస్టీపీ వద్ద దర్గా, అమ్మవారి దేవాలయాలకు రహదారిని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు విన్నవించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుందని, మూడు ప్యాకేజీల కింద 1257.50 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 31 శుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తెస్తుండగా అందులో కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో 17 ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే కోరిన విధంగా తాగునీటి సమస్య పరిష్కారం, చెరువుల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించడంతో పాటు దేవాలయం, దర్గాకు దారిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి ఇచ్చిన హామీలతో సమావేశానికి హాజరైన ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కూకట్పల్లి రంగధాముని (ఐడీఎల్) చెరువును మంత్రి కేటీఆర్ అధికారులతో కలిసి పరిశీలించారు.
సుందరీకరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, జలమండలి ఎండీ దాన కిశోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ఎస్టీపీ డైరెక్టర్ శ్రీధర్‌బాబు, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్.ప్రసాద్, ఎస్టీపీ జీఎం సత్యనారాయణ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు పండాల సతీశ్‌గౌడ్, ఆవుల రవీందర్‌రెడ్డి, మందడి శ్రీనివాస్‌రావు, ముద్దం నర్సింహ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, పగుడాల శిరీష, సబీహాబేగం, మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.