నేరేడ్మెట్, నవంబర్ 2 : కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా…బీఆర్ఎస్ ప్రభుత్వంపై గ్లోబల్ ప్రచారం చేసినా…మంచే గెలుస్తుందని, చివరికి ధర్మమే నిలబడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మల్కాజిగిరిని తాను దత్తత తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. గురువారం మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో గొడవలు, మత కలహాలతో ఎంతోమంది ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పెద్దగా రాష్ర్టాన్ని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ, తాగునీటి, కరెంట్ కష్టాలు తీర్చారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రేమ…దయా గుణంతో రాష్ర్టాన్ని పాలిస్తున్నారని చెప్పారు. తలసరి ఆదాయం, ధాన్యం ఉత్పత్తి, ఐటీ ఉద్యోగాల కల్పన ప్రతి రంగంలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని అన్నారు. రాష్ట్రంలో కరువు.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తకుండా శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ 75-80 సీట్లలో విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరిని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. నిన్నమొన్నటి వరకు కేసీఆర్ గొప్ప అని మాట్లాడిన మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు టికెట్ ఇవ్వకపోయేసరికి..స్వార్థం కోసం కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మైనంపల్లికి దమ్ము లేదని, మైనం‘పిల్లి’గా అభివర్ణించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.