Road Accident | మణికొండ, మార్చి 11 : అతివేగంతో వాహనాన్ని నడుపుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… గండిపేటలోని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ( TS08BEG4929) నెంబర్ గల స్విఫ్ట్ కార్లో ప్రయాణిస్తుండగా మంగళవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో నియో పోలీస్ సమీపంలోని రాజపుష్ప కన్స్ట్రక్షన్ సమీపంలో వేగంగా వాహనం నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీకర్(18) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మిగిలిన ఐదుగురిలో హేమ సాయి(19), వివేక్(19), సృజన(18), కార్తికేయ(18), హర్ష (19)కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో హర్ష సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన శ్రీకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నామని వెల్లడించారు. అతివేగమే నిండు ప్రాణాన్ని బలిగొన్నదని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అనేక పర్యాయాలు విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా… చేతుల్లో కారు ఉన్నంతసేపు పిల్లలు అతివేగంగా వెళ్లి తమ ప్రాణుల మీద తెచ్చుకుంటున్నారని ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఇందుకు అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా సహకరించాలని పోలీసులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.