అడ్డగుట్ట, జూన్ 28: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనపై దృష్టి పెట్టకుండా పేర్ల మార్పుపైనే నిరంతరం దృష్టి పెడుతుందని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఎద్దేవా చేశారు. అన్నపూర్ణ క్యాంటీన్‌కు ఇందిరమ్మ క్యాంటీన్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాలో కార్పొరేటర్ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాజకీయ లబ్ధి కోసమే పేరును మారుస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పెద్దల మెప్పు పొందడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి అన్నపూర్ణ పేరును ఇందిరమ్మ క్యాంటీన్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దాన్ని కాపీ పేస్ట్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేర్లు మార్చడం తప్ప ప్రజలకు సుపరిపాలనను అందించడం చేతకాదని ధ్వజమెత్తారు.