సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టిన ఓల్డ్ సిటీ మెట్రోకు అండర్ గ్రౌండ్ సర్వే చేయనున్నారు. భూగర్భంలో ఉన్న నిర్మాణాలు, పైపులైన్లు, కేబుళ్లను తెలుసుకునేందుకు వీలుగా ఈ అధ్యయనం చేస్తున్నట్లుగా మెట్రో వర్గాలు వెల్లడించాయి. 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు కటింగ్, ప్రతిపాదిత స్టేషన్ ప్రాంతాల్లో భౌగోళిక స్థితిగతులను అంచనా వేయనున్నారు.
మీరాలం మండి రోడ్డు, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఆలియాబాద్, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట వరకు జరగనుంది. మ్యూజియానికి 500 మీటర్ల దూరం ఉండే విధంగా ఈ సర్వే చేయనున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 60 ఫీట్ల రోడ్డు అందుబాటులో ఉండగా… దాదాపు 1200కు పైగా ప్రైవేటు, మతపరమైన కట్టడాలు, నిర్మాణాలు విస్తరణలో తొలగించాల్సి ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 120 ఫీట్ల మేర రోడ్డు అందుబాటులోకి రానుండగా, అందుకు అనుగుణంగానే ఈ సర్వే చేయనున్నారు.
కొనసాగుతున్న భూసేకరణ..
ఇప్పటివరకు 30 శాతానికి పైగా ఆస్తులను సేకరించారు. మిగిలిన ఆస్తులను సేకరించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులతో సమన్వయం చేస్తుండగా.. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భూసేకరణ వేగవంతం చేయాలని మెట్రో భావించింది. కానీ క్షేత్రస్థాయిలో ఎదురైన కోర్టు వివాదాలు, పరిహారం సమస్యలతో అనుకున్న స్థాయిలో భూసేకరణ ముందుకు సాగడం లేదు.