మల్కాజిగిరి, డిసెంబర్ 19: మెట్రో రైల్ రెండో దశను విస్తరించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు. మెట్రో రైల్ రెండో దశను విస్తరించాలని, అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని ఏడు కాలనీలకు స్టార్మ్ వాటర్ డ్రైన్ సమస్య, జొన్నబండలోని 582, 583 సర్వే నంబర్లలోని 55 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని, ఇక్కడ 50 ఏండ్లుగా సివసిస్తున్న పేద వడ్డెరలకు న్యాయం చేయాలని గురువారం అసెంబ్లీలోని కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో రైల్ రెండో దశను 105కిలో మీటర్లు విస్తరించాలన్నారు.జేబీఎస్ నుంచి మేడ్చల్ 20 కి.మీ, జేబీఎస్ నుంచి శామీర్‌పేట 22 కి.మీ, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ 22 కి.మీ, బోయిన్పల్లి నుంచి గండిమైసమ్మ 21 కి.మీ, తార్నాక నుంచి కీసర 20 కిలోమిర్ల కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, రెండో దశకు సర్వే నిర్వహించాలని సీఎంను కోరారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. క్వింటాల్ బియ్యానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.140 కమిషన్‌ను రూ.300కు పెంచాలని, క్వింటాల్ గోధుమలకు రూ.13ను రూ.140కి పెంచాలన్నారు. 55శాతం రేషన్ కార్డులు ఉన్నవారికే గోధుమలు సరఫరా అవుతున్నాయని, హమాలీ చార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారని.. కానీ, ప్రతి క్వింటాల్‌కు రేషన్ డీలర్లే రూ.16 చొప్పున భరిస్తున్నారని తెలిపారు.
ప్రతి 50కిలోల బస్తాలో 2నుంచి 3కిలోలు వ్యత్యాసంతో సరఫరా అవుతున్నాయన్నారు. కంటి ఆపరేషన్ చేసుకున్న వారిని ఐరిస్ గుర్తించడం లేదని, కుటుంబలోని మరో వ్యక్తికి ఐడెంటిఫికేషన్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చినట్లు డీలర్లకు నెలకు రూ.5వేల కమిషన్ పెంచాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.