సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): మెట్రో ఫేజ్-2 విస్తరణ అటకెక్కింది. కేంద్రానికి చేరిన డీపీఆర్‌కు ఆరు నెలలు గడిచినా.. మోక్షం లభించడం లేదు. డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలిపితే గానీ, హైదరాబాద్ కేంద్రంగా మెట్రో విస్తరణకు తావు లేదు. నిజానికి ఈ ప్రక్రియ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విస్తరణ ప్రతిపాదనలపై కంటి తుడుపు చర్యలతో నెట్టుకొస్తున్నది. దీంతో డీపీఆర్ ప్రతులు ఢిల్లీకి చేర్చిన మెట్రో బృందం… ఇక అడపాదడపా ఢిల్లీ, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్నానే తప్పా… స్పష్టమైన హామీ ఇప్పటికీ అందలేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకువచ్చే ఆలోచన చేయకపోవడంతో… అట్టహాసంగా ప్రకటించిన మెట్రో ప్రాజెక్టులో జరుగుతున్న జాప్యంతో ఆశలు నీరుగారిపోతున్నాయి.
కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూపు
గతేడాది నవంబర్ నెలలో డీపీఆర్ కేంద్రానికి చేరగా… ఇప్పటివరకు హైద్రాబాద్ మెట్రో ప్రతిపాదనలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. మెట్రో ఫేజ్-2 కోసం విస్తరించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సన్నాహాలు చేసింది. ఇప్పటికే డీపీఆర్ ప్రతులను కేంద్రానికి అందజేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 48 శాతం మేర జైకా, ఏడీబీ, ఎన్డీబీ(మల్టీ లెటరల్) వంటి ఆర్థిక సంస్థలతో ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం రూ. 7313 కోట్లు (30 శాతం), కేంద్ర వాటా రూ. 4230 కోట్లు(18 శాతం) మేర చేపట్టనున్నది. ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అప్పులకు కేంద్రం గ్యారెంటీ ఇవ్వనున్నది.
మిగిలిన 4 శాతం మేర రూ. 1033 కోట్లను పీపీపీ విధానంలో సమకూర్చి ప్రాజెక్టును చేపట్టేలా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును హైదరాబాద్ మెట్రో సంస్థ తయారు చేసింది. రెండో దశలో ఆరు కారిడార్లలో 116.4 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నట్లు తెలిపారు. ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, ఆరో కారిడార్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్లు, నార్త్ సిటీకి మరో 44 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించేందుకు ప్రతిపాదనలను తయారు చేయాల్సి ఉంది. అయితే మిగిలిన 5 కారిడార్ల నిర్మాణానికి అవసరమైన నివేదికలను రూపొందించగా, ఇప్పటికీ కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది.
ఆరు నెలలు గడిచినా..
తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో మెట్రో నిర్మాణానికి అంచనా వేసిన రూ. 4230 కోట్లు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం డీపీఆర్కైనా ఆమోదం లభిస్తుందని భావించినా… ఇప్పటికీ వరకు ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే డీపీఆర్ ఆమోదానికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే నార్త్ సిటీ, ఫోర్త్ సిటీ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించగా, త్వరలోనే కేంద్రానికి అందజేయనున్నారు. మూడు నెలలోగా డీపీఆర్‌కు ఆమోదం తెలిపితే… కనీసం సెప్టెంబర్ నాటికైనా పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ టెక్నికల్ సమస్యలపై కేంద్రం లేవనెత్తుతున్న సందేహాల నివృత్తితోనే ఆరు నెలలు సమయం గడిచిపోయింది.