సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలు ( మెట్రోమాల్స్) దీర్ఘ కాలిక లీజుకు ఇచ్చేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు మొదలు పెట్టింది. నగరంలో మూడు చోట్ల ఉన్న మాల్స్‌ను లీజుకు ఇవ్వడం ద్వారా ఒకేసారి రూ.2500 నుంచి 3వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో 69 కి.మీ మార్గాన్ని 3 కారిడార్లలో నిర్మించింది ఎల్ అండ్ టీ సంస్థ. అదే సమయంలో కారిడార్-1(మియాపూర్-ఎల్బీనగర్)లో పంజాగుట్ట, ఎర్రమంజిల్, మూసారంబాగ్ ప్రాంతాల్లో 3 మెట్రో మాల్స్‌ను నిర్మించగా, కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో హైటెక్ సిటీ వద్ద ఒక మాల్‌ను నిర్మించింది. మొత్తం 4 మాల్స్ ఉండగా, వాటి మొత్తం విస్తీర్ణం 12 లక్షల చదరపు అడుగుల వరకు ఉంది.
ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ హైదరాబాద్ నెక్ట్స్గలేరియా మాల్స్ పేరుతో నిర్వహిస్తోంది. తాజాగా 3 మెట్రో మాల్స్‌ను దీర్ఘ కాలిక లీజు కింద అప్పగించేందుకు నెక్సస్ సెలెక్ట్ ట్రస్టుతో సంప్రదింపులు జరుపుతోంది. 3 చోట్ల ఉన్న మెట్రో మాల్స్ విస్తీర్ణం మొత్తం సుమారు 9 లక్షల చదరపు అడుగులు ఉండగా, పంజాగుట్ట మాల్ విస్తీర్ణం 5 లక్షల చదరపు అడుగులు, హైటెక్ సిటీలోని ఇ-గెలిరియా మాల్ విస్తీర్ణం 2 లక్షలు, ఎర్ర మంజిల్‌లోని ప్రీమియా మాల్ విస్తీర్ణం మరో 2 లక్షల వరకు ఉంటుంది.
వీటిలో ఇప్పటి వరకు 84 శాతం స్థలాన్ని వివిధ సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందుతోంది. కాగా అన్ని మాల్స్‌ను ఒకేసారి దీర్ఘ కాలిక లీజుకు ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చుకునేందుకు ఎల్ అండ్ టీ సిద్ధమైనట్లు తెలిసింది. కాగా దీనిపై హైదరాబాద్ మెట్రో అధికారులు, ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు మాత్రం స్పందించలేదు.
రాయదుర్గంలో మెట్రో స్థలం లీజుకు..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు ప్రభుత్వం రాయదుర్గంలోని మైండ్ స్పేస్ జంక్షన్ సమీపంలో 15 ఎకరాలను కేటాయించింది. అందులో ఇప్పటికే రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంట్ డెవలప్మెంట్-టీఓడీ)లో భాగంగా బిజినెస్ పార్కు టవర్ 1ను నిర్మించారు. మిగతా ఖాళీ స్థలాన్ని మొత్తంగా ఇతర సంస్థలకు గతేడాది దీర్ఘకాలిక లీజుకు ఇచ్చింది. దీని ద్వారా సుమారు రూ.1200 కోట్ల ఒకేసారి సమకూర్చుకున్నట్లు సమాచారం.