‘మన ఊరు-మనబడి’ పథకంలో భాగంగాఇంగ్లిష్ మీడియం బోధన అద్భుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాల యూసుఫ్‌గూడలో ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగు, ఉర్దూలో కూడా బోధన కొనసాగుతుంది. అయితే ఈ స్కూల్లో ఉర్దూ, తెలుగు మీడియాల్లో కంటే ఇంగ్లిష్ మీడియంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులు నమోదయ్యారు. ఈ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న విద్యార్ధినీ విద్యార్థులు ఐఐటీ, ట్రిఫుల్ఐటీలకు ఎంపికయ్యారు. మొత్తం 40 మంది టీచర్లతో కొనసాగుతున్న ఈ స్కూల్లో మొత్తం 1,095 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాలురు 565 మంది, బాలికలు 530 మంది ఉన్నారు. తెలుగు మీడియంలో 105 మంది, ఉర్దూ మీడియంలో 42 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా.. ఇంగ్లిష్ మీడియంలో మొత్రం 848 మంది
విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు.
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు..
యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నారు. వారిలో 2018-19లో 124 మంది విద్యార్థులలో 102 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే 2019-20లో 166 మంది పది పరీక్షలకు హాజరుకాగా.. నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే 2020-21లో కూడా 133 మంది విద్యార్థులు నమోదు కాగా నూటికి నూరు శాతం ఫలితాలు నమోదు చేశారు.ఈ ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న చిట్టి చందన అనే విద్యార్థిని ఐఐటీ మద్రాసులో సీటు సంపాందించింది. అలాగే కార్తీక్ అనే విద్యార్థి ట్రిపుల్ఐటీ బాసర వంటి విద్యా సంస్థలో అడ్మిషన్లు పొందారు.
ఎన్జీవో సంస్థల సహకారం..
యూసుఫ్‌గూడ ప్రభుత్వ స్కూల్ అభివృద్ధిలో భాగంగా కుషీ ఎన్జీవో ఆర్గనేజేషన్ వారు నలుగురు ఉపాధ్యాయులను ఇచ్చారు. పైగా ఒక ప్రొజెక్టర్, 12 ట్యాబులు పాఠశాలకు బహూకరించారు. సిక్రానీ ఎన్జీవో ఆర్గనైజేషన్ వారు పాఠశాలకు ఒక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఒక వాచ్‌మెన్‌ను ఇచ్చినట్లు స్కూల్ హెడ్మాస్టర్ నరసింహా తెలిపారు. అలాగే సమర్థన నెస్ట్ ఎడ్యుకేషన్ అనే స్వచ్ఛంద సంస్థ పాఠశాలకు 65 డిజిటల్ ప్యానల్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలను డిజిటలైజేషన్ విధానంలో బోధించడానికి అవకాశం కలిగింది.
పోలీసు ఉద్యోగాలకు 50 మంది ఎంపిక..
ఇక్కడ ఎన్సీసీ కూడా ఉంది. ఎన్సీసీ 4వ బెటాలియన్ తెలంగాణ ఆధ్వర్యంలో స్కూల్లో ఎన్సీసీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎన్సీసీ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు ఎన్సీసీలో శిక్షణ కొనసాగిస్తున్నారు. ఇందులో 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అయితే ఈ స్కూల్లో ఎన్సీసీలో శిక్షణ పొందిన వారిలో 50 మందిపైగా పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.