సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): ఆటోమేటిక్ మీటర్ రీడర్స్ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వినియోగదారులను వేధిస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్ల గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలపై నీటి బిల్లుల మోత మోగిపోతున్నది. నెలకు వేలాది రూపాయల బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీటర్లు మరమ్మతులకు గురైనా, చెడిపోయినా సరఫరా చేసే ఏజెన్సీల వాళ్లు పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కొత్త మీటర్లు బిగించేందుకు రావాలంటూ ఫోన్ చేసినా, స్వయంగా వెళ్లి అడిగినా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారని వాపోతున్నారు.
రోజుల తరబడి తిరుగుతున్నా ఏజెన్సీల ప్రతినిధులు స్పందించడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో బల్క్ కనెక్షన్లు, అపార్ట్మెంట్లకు జలమండలి ఆటోమేటిక్ మీటర్ రీడర్స్ను ప్రవేశపెట్టింది. ఆ మీటర్లను బిగించే బాధ్యత ఏజెన్సీలకు అప్పగించింది. నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు ఏజెన్సీలు మీటర్లను తీసుకెళ్లి బిగించాల్సి ఉంటుంది. ఏదైనా మరమ్మతులకు గురైనా వారే వెళ్లి రిపేర్లు చేయాల్సి ఉంటుంది.
అందుకోసం వినియోగదారుల నుంచి జలమండలి ముందే ఛార్జీలు వసూలు చేసింది. ఏజెన్సీలు సకాలంలో స్పందించకున్నా, వినియోగదారులకు అందించే సేవల్లో ఇబ్బందులకు గురిచేసినా జలమండలి తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఏజెన్సీని రద్దు చేసి కొత్తవారికి అవకాశం కల్పించాలి. కానీ ఏజెన్సీలు వినియోగదారుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొత్త మీటర్ కోసమైనా, మరమ్మతులు చేయడానికైనా వెళ్లడానికి మొండికేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జలమండలి నిర్లక్ష్యంతో ప్రజల అవస్థలు ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల మీటర్ పనిచేయకపోవడంతో యావరేజీ పేరిట జలమండలి అధికారులు రూ. వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వస్తుండటంతో జలమండలి అధికారులను ప్రశ్నిస్తే మీటర్ రిపేరులో ఉండటం వల్ల యావరేజీగా బిల్లు వేస్తున్నామని బదులిస్తున్నారు. ఆటోమేటిక్ మీటర్ కోసం వినియోగదారుల వద్ద కనెక్షన్ తీసుకునే రోజునే వేలల్లో వసూలు చేసిన జలమండలి..వినియోగదారులకు జవాబుదారీగా ఉండటం లేదని ఆరోపిస్తున్నారు.
ఏజెన్సీలతో కుమ్మక్కై ప్రజాధనాన్ని వాళ్లకు దోచిపెడుతున్నారని మండిపడుతున్నారు. ఏజెన్సీలు.. జలమండలి అధికారుల తీరుతో తీవ్ర అవస్థలు పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. వినియోగదారులకు సకాలంలో సేవలందించని వారికి మీటర్లు సరఫరా చేసేందుకు అనుమతులిచ్చి జలమండలి అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏజెన్సీల తీరుపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మీటర్లు పనిచేయడం లేదనే నెపంతో బిల్లులు మాత్రం ఇష్టానుసారం వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకుని నీటి బిల్లుల మోతను అరికట్టడాలని డిమాండ్ చేస్తున్నారు.