మెహిదీపట్నం, జనవరి 3: ఏటీఎంల వద్దకు వచ్చే వృద్ధులు, అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను మెహిదీపట్నం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.52 వేల నగదు, 89 ఏటీఎం కార్డులు, మూడు సెల్ఫోన్లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
మెహిదీపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ జి.చంద్రమోహన్, అదనపు డీసీపీ కృష్ణాగౌడ్, ఇన్స్పెక్టర్ మల్లేష్, అదనపు ఇన్స్పెక్టర్ రాంబాబులతో కలిసి వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ర్టానికి చెందిన ఆమీర్ సోహైల్ (24), ముబారిక్(26), ముస్తకీన్(25), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఎండీ.అమెర్(33)లు ముఠాగా ఏర్పడి ఏటీఎంల వద్ద డబ్బులు విత్‌డ్రా చేయడానికి వచ్చే అమాయకులను లక్ష్యంగా చేసుకుని దోపిడికి పాల్పడుతున్నారు. అమాయకులకు మాయ మాటలు చెప్పి ఏటీఎం కార్డులను మార్చి డబ్బులు డ్రా చేసి పారిపోతారు.
గతేడాది డిసెంబర్ 31న మల్లేపల్లి క్రాస్‌రోడ్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్ద ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఆల వెంకటేష్ తన తల్లి బ్యాంక్బాలెన్స్ చెక్ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేష్‌కు సహాయం చేయడానికి వచ్చి అతడిని మాయమాటలలో ఉంచి కార్డును మార్చి సుమారు రూ.90 వేలు విత్‌డ్రా చేసి డబ్బులు తీసుకుని పారిపోయారు. దీనిపై బాధితుడు మెహిదీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు శనివారం నలుగురు సభ్యుల ముఠా ను పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.