అందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి
క్యాంపు కార్యాలయంలో వైద్యాధికారులతో ఎమ్మెల్యే సాయన్న సమీక్ష
సికింద్రాబాద్, ఏప్రిల్ 19: ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా ప్రతీ ఆరు నెలలకు ఒక్కసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. మంగళవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్‌కు చెందిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఎమ్మెల్యే సాయన్న సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న బోర్డు పరిధిలోని ఐదవ వార్డు వాసవీనగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్న ఉచిత మెగా హెల్త్ మేళాపై వైద్యాధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ గురువారం నిర్వహించే హెల్త్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెగా హెల్త్ మేళాలో కేసీఆర్ కిట్, బీపీ, షుగర్ వంటి జనరల్ పరీక్షలతో పాటు క్యాన్సర్, కంటి, దంత వైద్యం వంటి రోగాల నిర్ధ్దారణతో పాటు ఉచిత వైద్యం, మందులు ఇవ్వనున్నారన్నారు. ఈ మెగా హెల్త్ మేళాను కంటోన్మెంట్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సాయన్న సూచించారు.