ఉస్మానియాయూనివర్సిటీ, ఫిబ్రవరి 26 : చిన్నారి నుంచి వృద్ధుల వరకు నిత్యం తాగే పాలకు కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. అవసరాలకు తగినట్లు సేకరణ పెంచుతూనే సరఫరా చేస్తూ ప్రైవేటు కంటే మార్కెట్లో తక్కువ ధరకు నాణ్యమైన పాలు విక్రయిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు పాల డెయిరీల వంత పాడుతూ ప్రభుత్వ డెయిరీ విజయను నష్టాలబాట పట్టించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో పాల సేకరణ ధర పెంచి ఉత్పత్తిదారులకు ప్రోత్సాహమిచ్చారు. దాణా, ఇతర ముడిపదార్థాలపై రాయితీ ఇవ్వడమే కాకుండా పాలు విక్రయించే వారికి సులభంగా రుణాలు మంజూరు చేశారు. పాడి రైతులను ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్న విజయ డెయిరీ యాజమాన్యం మెగా డెయిరీ నిర్మాణానికి నడుంబిగించింది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో కూడిన మెగా డెయిరీని నిర్మించేందుకు ఇప్పటికే పనులను ప్రారంభించారు.
మహేశ్వరం మండలం రావిల్యాలలో..
మెగా డెయిరీ నిర్మాణ ప్రతిపాదన 2018లో వచ్చింది. కరోనా విజృంభణ, అనంతర పరిస్థితులతో నిర్మాణం జాప్యం జరిగింది. గతేడాది సెప్టెంబర్ మొదటివారంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిల్యాల గ్రామంలో 37 ఎకరాల విస్తీర్ణంలో డెయిరీ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఔటర్‌రింగ్ రోడ్డు పక్కనే ఉండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రాకపోకలకు సులువుగా ఉండడమే కాకుండా పాల సేకరణ, సరఫరా వేగవంతమవుతుంది.
రూ.246.25 కోట్ల వ్యయంతో..
మెగా డెయిరీని అత్యాధునిక యంత్రపరికరాలతో అత్యున్నత స్థాయిలో నిర్మిస్తున్నారు. రూ.246.25 కోట్ల వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని చైర్మన్ లోక భూమారెడ్డి సంస్థ ప్రతినిధులను కోరారు. వచ్చే సంక్రాంతిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది.
పెరగనున్న విజయ డెయిరీ సామర్థ్యం
ప్రస్తుతం విజయ డెయిరీ నిత్యం రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతుల నుంచి 5 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. వీటిని ప్రాసెస్ చేసి పాలు, ఇతర పాల ఉత్పత్తులుగా మార్చి విక్రయిస్తోంది. మెగా డెయిరీ అందుబాటులోకి వస్తే మరో 8 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేసే సామర్థ్యం పెరుగుతుంది. మొత్తంగా విజయ డెయిరీ సామర్థ్యం 13 లక్షలకు చేరుతుంది. రూ.710 కోట్లు ఉన్న వార్షిక టర్నోవర్ దాదాపు రూ.2 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం డెయిరీ ద్వారా 2.13 లక్షల పాడి రైతులు లబ్ధిపొందుతుండగా, మెగా డెయిరీ అందుబాటులోకొస్తే మరో 5 లక్షల మందికి మేలు చేకూరనుంది.
విజయ డెయిరీని అగ్రగామి చేస్తాం
విజయ డెయిరీని దేశంలోనే అగ్రగామి డెయిరీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. సీఎం కేసీఆర్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సహకారంతో నష్టాల్లో ఉన్న సంస్థను లాభాలబాట పట్టించాం. పాడి రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. డెయిరీని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా ఒకటిన్నర రెట్ల సామర్థ్యంతో మెగా డెయిరీ ప్లాంటు నిర్మిస్తున్నాం. పనులు వేగంగా జరిగేలా చూస్తున్నాం. వచ్చే సంక్రాంతిలోపు ప్రారంభిస్తాం.
– లోక భూమారెడ్డి, చైర్మన్, టీఎస్డీడీసీఎస్ఎఫ్