కొండాపూర్, ఆగస్టు 21 : 23 వారాల సమయంలో 565 గ్రాముల బరువుతో జన్మించిన ప్రీమెచ్యూర్ బేబీకి మెరుగైన వైద్య సేవలందించి ప్రాణం పోశారు మెడికవర్ వైద్యులు. అనంతరం శిశువును తల్లిదండ్రులకు చెంతకు చేర్చారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువులు బ్రతకడం ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదు.
ఈ సందర్భంగా నియోనాటాలజిస్ట్ ఛీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ రవీందర్‌రెడ్డి పరిగే మాట్లాడుతూ.. సోమాలియా దేశానికి చెందిన ఓ మహిళకు ఏప్రిల్ 18వ తేదీన మాదాపూర్‌లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖానలో 23 వారాల సమయంలో 565 గ్రాముల బరువుతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు ఇంటెన్సివ్‌కేర్ యూనిట్లో 115 రోజులుంచి, మెరుగైన వైద్య చికిత్సనందించడంతో 2 కిలోల బరువుతో ఎలాంటి సమస్యలు లేకుండా డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్సెట్రిషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక, డాక్టర్ నవిత, డాక్టర్ వంశీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.