సిటీబ్యూరో/పహాడీషరీఫ్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): నొప్పుల గోళీలను డ్రగ్స్ మందుగా వాడుతున్న యువకులు సంవత్సర కాలంగా ఇలాంటి మందులను వాడుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నొప్పులకు ఉపయోగించే గోళీలను ఎక్కువ మొత్తంలో తీసుకొని దవాఖానలో రోగులకు ఎక్కించే సెలాయిన్ వాటర్‌లో కలిపి ద్రవరూపంగా మార్చి, దానిని ఇద్దరు మైనర్లు, ఓ యువకుడు ఇంజక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాలుడు(17) మృతి చెందగా, మరో మైనర్‌తో పాటు ఓ యువకుడు ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనలో యువకులకు నిబంధనలకు విరుద్దంగా మందులు సరఫరా చేస్తున్న షాహిన్, శంషాబాద్‌లోని శ్రీనివాసమెడికల్ స్టోర్స్ యజమాని ప్రవీణ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాపూర్ పోలీసులతో పాటు తెలంగాణా యాంటీ నార్కొటీక్ బ్యూరో(టీజీన్యాబ్) దర్యాప్తు జరిపింది. ఈ దర్యాప్తులో మరో ముగ్గురు యువకుల ద్వారా ప్రస్తుతం బాధితులుగా ఉన్న ఇద్దరు మైనర్లు, మరో యువకుడు ఈ ట్యాబ్లెట్లకు అలవాటయ్యారని, ఏడాది కాలంగా యువకులు ఈ అలవాట్లకు బానిసలుగా ఉన్నారనే విషయాన్ని నిర్ధారించారు. ఈ ఘటనపై టీజీన్యాబ్ జరిగిన ఘటనపై, పోలీసులు నిందితుల అరెస్ట్‌పై వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.
రాకెట్ గుట్ట రట్టు..
ఈనెల 17న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్, వెల్డింగ్ వర్క్ చేసుకునే అతడి స్నేహితుడు మైనర్, జూమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఎండీ షాబాజ్‌లు షాహిన్నగర్కు చెందిన సయ్యద్ షాహిల్‌ను కలిసి కొన్ని ట్యాబ్లెట్లను తీసుకొని వాటిని పౌడర్‌గా చేశారు. ఆ పౌడర్‌ను సెలాయిన్ వాటర్లోలో కలిపి దానిని ఇంజెక్ట్ చేసుకున్నారు. ఇదంతా రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ఆ రోజు జరిగింది. వాళ్లంతా ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లారు. మరోసటి రోజు అపస్మారక స్థితిలోకి వెళ్లడతో కుటుంబసభ్యులు మీర్‌చౌక్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.అందులో ఇంటర్ చదువుతున్న బాలుడి పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ ఈనెల19న మృతి చెందాడు.
మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమించడంతో వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.ఈఘటనపై మృతుడి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. డ్రగ్స్ మాఫియా, నెట్‌వర్క్‌పై ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్టు చేయడంతో టీజీన్యాబ్ ఈ విషయంపై ఆరా తీసింది. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులతో కలిసి విచారణ జరిపింది. దర్యాప్తులో ట్యాబ్లెట్లు సరఫరా చేసిన షాహిల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తాను శంషాబాద్‌లోని సిరూమని జగన్నాథ ప్రవీణ్‌కు చెందిన మెడికల్ దుకాణంలో ఎంఆర్పీ ధర రూ.39ఉంటే, రూ. 45కు ఎక్కువ మొత్తంలో ట్యాబ్లెట్లు తీసుకుంటున్నానని, వాటిని రూ.150చొప్పున బయట విక్రయిస్తున్నాని వెల్లడించాడు.
ఇంతకు ముందు షాహిన్నగర్కు చెందిన మహ్మద్అయాన్, జునైద్‌ఖాన్, మరో బాలుడి ద్వారా ముగ్గురు బాధితులు ప్రభావితమైనట్లు విచారణలో వెల్లడయ్యింది.టాపెంటాడోల్ హైడ్రోక్లోరైడ్ మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో ఇవ్వకూడదనే నిబంధన ఉందని, ఈవీ హెచ్1 లిస్ట్‌లో 2021లో నమోదయ్యాయని టీజీ న్యాబ్ తెలిపింది.ఇదిలాఉండగా.. నిందితుడు షాహిన్పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లైన సీపీ-డాల్-100 బాధితులకు ఇచ్చాడని, వాటిని ఎక్కువ మొత్తంలో వాడితే ప్రాణాలకే ప్రమాదమని ఇద్దరు నిందితులకు అవగాహన ఉందని బాలాపూర్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో నిందితులిద్దరిపై సెక్షన్ 105 (కల్పబుల్హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టూ మర్డర్, 278, 125 ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్, సెక్షన్ 77 జువెనల్ జస్టిస్ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.