కంటోన్మెంట్, డిసెంబర్ 17: బోల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో వైద్యం పడకేసింది. వందల ఏండ్ల నాటి చరిత్ర కలిగి పది ఐసీయూ బెడ్స్తో పాటు 75 పడకలు ఈ వైద్యశాలలో సరైన వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో నాణ్యమైన వైద్యం అందడం లేదు. నిత్యం మూడు నుంచి నాలుగు వందల మంది ఆవుట్ పేషెంట్లుగా వైద్యం కోసం ఇక్కడికి ప్రతి రోజూ వస్తుంటారు. రోగులకు అందుబాటులో సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. 24/7 ఆరోగ్య సేవలు అందించే జనరల్ ఆసుపత్రిలో రెగ్యులర్గా విధులు నిర్వహించేందుకు కనీసం పది మంది వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఆర్ఎంఓతో పాటు ముగ్గురు వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
జనరల్ మెడిసిన్ వైద్యులు లేరు. ఇక గైనిక్ డాక్టర్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉంటారు. కాంట్రాక్ట్ పద్ధతిలో జేయూకే ఏజెన్సీ ద్వారా ఇద్దరు డాక్టర్లు, 12 మంది నర్సులు, 30 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ వీరికి సదరు ఏజెన్సీ సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. సిబ్బంది తరచుగా విధులకు గైర్హాజరవుతున్నారు. గత నాలుగు నెలల నుంచి వీరికి జీతాలు లేవు.
ప్రముఖులు సందర్శించినా..
బొల్లారం లోని కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రికి గతంలో మల్కాజిగిరి ఎంపీగా కొనసాగిన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్… ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్లు సందర్శించి కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు కల్పిస్తామని హామీ ఇచ్చారే తప్ప.. ఇప్పటివరకు నెరవేర్చలేకపోయారని స్థానికులు పేర్కొంటున్నారు. జనరల్ ఆసుపత్రిలో కనీస వసతుల కల్పనకు, మందుల కొనుగోలు కోసం నిధుల కేటాయింపు విషయమై కంటోన్మెంట్ బోర్డు సీఈవోను సంప్రదించినప్పటికీ నిధులు కొరత ఉందని బడ్జెట్ విడుదల చేయలేమని సమాధానం ఇస్తున్నారని..ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది పేర్కొంటున్నారు. పాలకులు మౌలిక వసతులు కల్పించి వైద్యం కోసం పేదలు వచ్చే జనరల్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఆసుపత్రిలోకానరాని వసతులు..
నిత్యం వందలాది మంది వచ్చే రోగులకు అందుబాటులో కనీస వసతులు కానరావు. ఎక్స్రే విభాగంలో ఎక్స్రే మిషన్ నాలుగు నెలలుగా పనిచేయడం లేదు. అల్ట్రా సౌండ్, స్కానింగ్ విభాగం, ప్యాథాలజీ ల్యాబ్, ఎండోస్కోపింగ్, ఎకో టెస్టింగ్ నిర్వహించేందుకు యంత్రాలు లేవు. ఇక ఫార్మసీలో కేవలం పారాసిటమల్, టాబ్లెట్లు, దగ్గు మందులు, కొన్ని బేసిక్ మందు లు తప్ప.. రోగులకు కావాల్సిన మందులు లభించవు. దీంతో వేలాది రూపాయలు వెచ్చించి బయటి నుంచి మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
అత్యవసర పరిస్థితిలో స్కానింగ్, ఎక్స్రే అవసరముంటే రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిందే. ఇక్కడ సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో పేదలు గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ చొరవతో మెఘా ఇంజినీరింగ్ కంపెనీ అంబులెన్స్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సాద కేశవరెడ్డి మరో అంబులెన్సు వితరణ చేసినప్పటికీ ఆసుపత్రిలో అత్యావసర సమయాల్లో రోగులకు అందుబాటులో ఉండవు.