బంజారాహిల్స్, జనవరి 23 : పేదలకు నాణ్యమైన వైద్యం, విద్యను అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్.శ్రీనివాస్, నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప అన్నారు. ప్రముఖ సామాజిక సేవా సంస్థ హీల్ (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్) ఆధ్వర్యంలో పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో ఏర్పాటు చేసిన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ను సోమవారం వారు ప్రారంభించారు. ధనిక, పేద అనే తేడాలేకుండా తమ సంస్థ ఆధ్వర్యంలో రూ.10కే మెడికల్ కన్సల్టేషన్ అందిస్తామని, అత్యంత తక్కువ ధరలో వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయిస్తామని హీల్ సంస్థ వ్యవస్థాపకులు సత్యప్రసాద్ తెలిపారు.
ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా నేరుగా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లడం, అక్కడ అవసరం ఉన్నా.., లేకున్నా వేలాది రూపాయల ఖర్చుతో వైద్య పరీక్షలు చేయించుకోవడం ఇటీవల సర్వసాధారణంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితి లేకుండా అతితక్కువ ధరలో వైద్యసేవలు అందించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వైద్యులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి ఉచితంగా సేవలు అందించేందుకు అంగీకరించారని చెప్పారు. ఫిబ్రవరి 22నుంచి తమ సంస్థలో వైద్య సేవలు అందిస్తామన్నారు. దీంతో పాటు పేద విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని సంస్థ డైరెక్టర్ డా.మణిమాల తెలిపారు. ఈ కార్యక్రమంలో హీల్ సెంటర్ డైరెక్టర్ డా.గీతిక, సవితాదేవి, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.