తెలుగు యూనివర్సిటీ, మే 4. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని వైద్య, ఆరోగ్య, శాఖ మంత్రి హారీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎల్.బి. స్టేడియంలో గురువారం సాయంత్రం జరిగిన క్రైస్తవ మతస్తుల ప్రార్థనా సమావేశాల్లో ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులం, మతం లేకుండా సీఎం కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.
ఉప్పల్ భగాయత్‌లో క్రైస్తవ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలం కేటాయించామన్నారు. కొందరు క్రిస్టియన్లను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, కానీ సీఎం కేసీఆర్ సమాజ సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల పాలనలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని వివరించారు. ప్రశాంతగా ఉన్న రాష్ట్రంలో కొందరు కులమతాల పేరుతో రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, ప్రజలు గమనించి సరైన సమయంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదలే మా మతం అని పేర్కొన్నారు. విదేశాల్లో నేడు పేదల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రభుత్వం రూ.20లక్షలు మంజూరు చేస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకుని అభవృద్ధిని సాధించాలని మంత్రి తెలిపారు.