Hyderabad | సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): నగరంలో జోరుగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక బార్ యాజమాన్యం నకిలీ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన విషయం మరవక ముందే తాజాగా రాజేంద్రనగర్, కాటేదాన్‌లో మరో నకిలీ మద్యం సరఫరా ముఠా గుట్టును ఆబ్కారీ పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ధనార్జనే ధ్యేయంగా నగరంలో కొందరు బార్ల నిర్వాహకులు ఇలాంటి కల్తీ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నట్లు నగరంలోని ట్రూప్స్ బార్ ఘటనతో మరోసారి రుజువైంది.
ఈ తరహా కల్తీ మద్యం విక్రయాలు హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని చాలా బార్లలో జరుగుతున్నట్లు మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. బార్లలో మద్యం తాగుతున్నప్పుడు లిక్కర్ నాణ్యతపై ఏదైనా అనుమానం కలిగి ప్రశ్నిస్తే నిర్వాహకులు దౌర్జన్యాలకు దిగడం, దాడులకు పాల్పడటం వంటి చర్యలకు దిగుతున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. మరోపక్క గ్రేటర్, శివారు ప్రాంతాల్లో ఉన్న కొన్ని బార్లలో మొదటి ఒకటి రెండు పెగ్గులు సరిగ్గానే పోసినా, ఆ తరువాత పెగ్గులన్నీ కల్తీనే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే మద్యం మాఫియాలు ధనార్జన కోసం విక్రయించే కల్తీ మద్యం వల్ల మద్యం ప్రియుల ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు వైద్యనిపుణులు. కల్తీ మద్యం వల్ల కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా బార్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయించకపోవడమే కాకుండా కల్తీ మద్యం దందా నిర్వహిస్తున్న ట్రూప్స్ బార్ అండ్ రెస్టారెంట్ ఓ యూత్ కాంగ్రెస్ నాయకుడిదిగా ప్రచారం జరుగుతోంది.
ట్రూప్స్ బార్ ఘటనతో….
లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న ‘ట్రూప్స్ బార్’కు సంబంధించిన లైసెన్స్‌ను నిర్వాహకులు రెన్యువల్ చేయించుకోలేదు. అంతేకాకుండా మద్యం డిపోల నుంచి మద్యాన్ని కూడా తీసుకోకుండానే బార్‌ను మాత్రం నిర్వహిస్తున్నారు. మద్యం తీసుకోకుండా బార్‌ను ఎలా నిర్వహిస్తున్నారనే అనుమానంతో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ తన బృందంతో కలిసి గురువారం రాత్రి ట్రూప్స్ బార్‌పై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో భాగంగా ఖరీదైన మద్యం బాటిళ్లలో చౌక ధర కలిగిన మద్యాన్ని కలుపుతున్న కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునిత్ పట్నాయక్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులు రూ. 2690 ఖరీదైన ‘జెమ్సన్’ మద్యం సీసాలో వెయ్యి రూపాయల ఖరీదైన ‘ఓక్స్ మిత్’ మద్యాన్ని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని వైన్‌షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్‌ను అనుమానం రాకుండా తీసి, అందులో నుంచి సగం మద్యాన్ని మరో సీసాలోకి నింపి, ఆ సగం సీసాలో నీరు, చౌక ధర గల మద్యాన్ని నింపుతున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
రూ.1.48 లక్షల విలువైన మద్యం సీజ్..
ఈ దాడుల్లో రూ.1.48లక్షల విలువ గల 75 కల్తీ మద్యం బాటిళ్లు, 55 ఖాళీ మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బార్ లైసెన్స్ యజమాని ఉదయ్‌కుమార్‌రెడ్డి, కల్తీ మద్యం తయారు చేసిన మేనేజర్ సత్యనారాయణ రెడ్డి, బార్ ఉద్యోగి పునిత్ పట్నాయక్ లపై కేసు నమోదు చేసి, షోకాజ్ నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. కాగా కల్తీ మద్యం కేసును ఛేదించిన రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్, సీఐ సుభాశ్ చందర్ రావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, అఖిల్ , కానిస్టేబుళ్లు సుధాకర్ , కిషన్ , శ్రీనివాస్ , సుదీప్ రెడ్డి, పెంటారెడ్డి, దుర్గ శ్యామ్ ప్రసాద్‌లను ఆబ్కారీ ఈడీ వి.బి.కమలాసన్ రెడ్డి, డిప్యూటి కమిషనర్ దశరథ్ , అసిస్టెంట్ కమిషనర్ కిషన్ అభినందించారు.