మేడ్చల్, జవహర్‌నగర్/పీర్జాదిగూడ/ ఘట్కేసర్ రూరల్/ బోడుప్పల్/ఆగస్టు 27: మంత్రి మల్లారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ.. వివిధ పోలీస్స్టేషన్లలో శుక్రవారం ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ముదిరాజ్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తదితరులు జవహర్‌నగర్, మేడిపల్లి పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
అలాగే ఘట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పావనీ జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు వెంకటేశ్, కౌన్సిలర్లు రమాదేవి, వెంకట్‌రెడ్డి, రవీందర్, మల్లేశ్, పోచారం మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మందడి సురేందర్, మున్సిపాలిటీ చైర్మన్ బి.కొండల్‌రెడ్డితో పాటు ఘట్కేసర్ మండల అధ్యక్షుడు కందుల కుమార్ ముదిరాజ్ వేర్వేరుగా ఘట్కేసర్ పీఎస్‌లో, బోడుప్పల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మేయర్ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వారి వెంట కార్పొరేటర్లు జంగయ్యయాదవ్, చందర్‌గౌడ్, మహేందర్ తదితరులు ఉన్నారు. అలాగే మంత్రి మల్లారెడ్డిపై సెల్ ఫోన్ వీడియోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి వెంట మేడ్చల్ ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయానందరెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 27 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్‌గౌడ్ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పొర్లుదండాల యాత్ర చేసినా తెలంగాణ జనం నమ్మరని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలది చీకటి ఒప్పందమని.. రేవంత్‌రెడ్డి, బండి కూతలకు జనం తప్పకుండా వాతలు పెడతారని హెచ్చరించారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషిస్తే తెలంగాణ సమాజాన్ని దూషించినట్టేనన్నారు.
బండి సంజయ్ చేపట్టే ప్రజాసంగ్రామ యాత్ర ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తున్నదని, బీజేపీ నాయకులకు నిజంగా దమ్ముంటే రాష్ర్టానికి రావాల్సిన నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తూ అభివృద్ధి నిరోధకులుగా మారారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడుతూ ప్రజల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి పిచ్చికూతలు మానుకోవాలని, బండి సంజయ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కిరణ్‌గౌడ్ హితవు పలికారు.