మేడ్చల్, అక్టోబర్ 24 : మేడ్చల్ నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది. బీసీ నేతలకు 20 ఏండ్ల నుంచి అన్యాయం జరుగుతున్నదని, నియోజకవర్గంలో పార్టీ కొందరి కబంధ హస్తాల్లో నడుస్తున్నదని ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈసారి బీసీలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాలు వేదికగా తన ఆవేదన తెలిపారు. ఈ విషయం మేడ్చల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని శామీర్‌పేట మండలానికి చెందిన బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి నూనెముంతల రవీందర్ గౌడ్ తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
నియోజకవర్గంలో 20 ఏండ్ల నుంచి బీజేపీ కొందరి కబంధ హస్తాల్లో నడుస్తున్నదన్నారు. పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నప్పటికీ న్యాయం చేయడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు మొత్తం ఒక సామాజిక వర్గానికే ఇస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బీసీ వాదం తీసుకున్నదని, బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరినట్టు తెలిపారు. బీజేపీలో తాను 15 ఏండ్లుగా పని చేస్తున్నానని, ఎన్నో రకాల పదవులు తీసుకొని, ప్రతి పదవికి న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు. గుర్రంపోడు పోరాటంలో సుమారు 40 రోజులు జైలుకు వెళ్లినట్టు తెలిపారు. పార్టీ కోసం పని చేస్తున్న బీసీ బిడ్డను.. తనను అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆ పార్టీ అధిష్టానాన్ని కోరారు. పార్టీ పెద్దలు ఈ విషయాన్ని ఆలోచించి, తనకు లేదా బీసీలకు మేడ్చల్ టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.