కార్వాన్: ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్ (Hyderabad) నగరంలో మతకల్లోలాలను రెచ్చగొట్టేందుకు గుర్తుతెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. టప్పాచబుత్ర (Tappachabutra) పోలీస్స్టేషన్ పరిధిలోని హనుమాన్ ఆలయం (Hanuman Temple) ప్రాంగణంలోగల శివాలయం (Shivalayam) లో శివలింగంపై బుధవారం (Wednessday) ఉదయం మాంసం ముద్దలు (Meat pieces) వేసి కలకలం రేపారు. ఇవాళ ఉదయం పూజ చేసేందుకు ఆలయానికి వెళ్లిన ఓ భక్తురాలు శివలింగంపై మాంసం ముద్దలు చూసి పోలీసులకు, స్థానికులకు సమాచారం ఇచ్చింది.
దాంతో పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ టాస్క్ ఫోర్స్ బలగాలతోపాటు సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.