GHMC | సిటీబ్యూరో:గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని టార్గెట్ చేసింది. ప్రాపర్టీ ట్యాక్స్ డేటాబేస్ ఆధారంగా 317033 మంది కమర్షియల్ కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లిస్తుండగా, వీరంతా ట్రేడ్ లైసెన్స్‌ల జాబితాలోకి రావాల్సి ఉంది. కానీ కేవలం లక్షా 9వేల 702 మంది మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నట్లు అధికారులు తేల్చారు. 30 సర్కిళ్లలో ట్రేడ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి వారి నుంచి ఫీజులు వసూలు చేసేలా తాజా కార్యాచరణను సిద్ధం చేశారు. డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్, లైసెన్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్స్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్స్లకు తనిఖీలు నిర్వహించి ట్రైడ్ లైసెన్స్‌ల జాబితాలోకి చేర్చాలని కమిషనర్ ఇలంబర్తి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. సంస్థ ఆదాయాన్ని పెంచుకునే దిశలోనే వ్యాపారస్తులపై స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతుండడం గమనార్హం.
సర్కిళ్ల వారీగా తనిఖీలు
30 సర్కిళ్లలో నాన్ రెసిడెన్షియల్ పీటీఐఎన్లు (ఇంటి నంబర్లు)ను గుర్తించారు. రెండు లక్షల 49వేల 522 వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ జాబితాలో లేరని ఆస్తిపన్ను చెల్లింపుల ద్వారా నిర్ధారించారు. కమర్షియల్ కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లిస్తుండగా, వీరంతా ట్రేడ్ లైసెన్స్ జాబితాలో లేరని తేల్చారు. ఈ మేరకు సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత డీసీ, ఏఎంఓహెచ్, సిబ్బందికి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సర్కిళ్లగా జాబితా ప్రకారం.. తనిఖీలు చేస్తున్న అధికారులు త్వరలో నివేదిక ఇవ్వనున్నారు. అత్యధికంగా గోషా మహల్ 34137 వ్యాపారస్తులు ఉండగా, బేగంపేట 20324, శేరిలింగంపల్లి 17055, చార్మినార్‌లో 15313, ఖైరతాబాద్ 14745 వ్యాపారస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
వీటితో పాటు మిగతా సర్కిళ్లను పరిశీలిస్తే కాప్రాలో 7853, ఉప్పల్ 5483, హయత్‌నగర్ 6773, ఎల్బీనగర్ 6094, సరూర్‌నగర్ 6893, మలక్‌పేట 6572, సంతోష్‌నగర్ 3022, చాంద్రాయణగుట్ట 2451, ఫలక్‌నుమా 5171, రాజేంద్రనగర్ 5477, మెహిదీపట్నం 8492, కార్వాన్ 4625, గోషామహల్ 34137, ముషీరాబాద్ 6675, అంబర్‌పేట 9750, జూబ్లీహిల్స్ 9815, యూసుఫ్‌గూడ 3209, చందానగర్ 7437, ఆర్సీ పురం, రామచంద్రాపురం 2390, మూసాపేటలో 7948, కూకట్‌పల్లిలో 7349, కుత్బుల్లాపూర్‌లో 6653, గాజుల రామారం 4591, అల్వాల్ 4903, మల్కాజిగిరి 5549, సికింద్రాబాద్‌లో 2773ల వ్యాపారస్తులపై సర్వే చేసి కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నారు.