సిటీబ్యూరో, మే 16(నమస్తే తెలంగాణ): నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నగరానికి నీటి సరఫరా ప్రక్రియ సజావుగా సాగుతుందని, రాబోయే రోజుల్లో మరింత నీటి నిల్వలు తగ్గితే రెండో దశ పంపింగ్ చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తామని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నీటి సబ్ మెర్సిబుల్ పంపులను ఏర్పాటు చేసి నీటి సరఫరాకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులతో కలిసి ఎండీ ఎమర్జెన్సీ పంపింగ్ పనులను పరిశీలించారు. జలమండలి పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో తాగునీటి సరఫరా కూడా పెరిగిందని చెప్పారు. హైదరాబాద్ మహానగరానికి ఈ వేసవిలో 580 ఎంజీడీల నీటి సరఫరా చేశామని, ఇప్పటి వరకు ఇదే అత్యధిక సరఫరా అని ఎండీ తెలిపారు.
వివిధ సోర్స్‌ల నుంచి గతేడాది కంటే 20 ఎంజీడీలు అదనపు నీటిని నగర వాసులకు అందించామన్నారు. అనంతరం ఎండీ సుదర్శన్‌రెడ్డి సుంకిశాల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పురోగతిని అధికారుల్ని ఆడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పైపులైన్ పనులను ఎండీ పరిశీలించారు. ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటిలో టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుది దశకు చేరుకున్నాయని, సివిల్ వర్క్స్ కొనసాగుతున్నాయని ఎండీ వివరించారు.
ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి ఈ సెప్టెంబరు వరకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎండీ అధికారులకు సూచించారు. సాధారణంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో డెడ్‌స్టోరేజీలో 25.941 టీఎంసీలు, 510 అడుగుల నీరు ఉన్నంత వరకు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. వేసవిలోనూ తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. నాగార్జున సాగర్‌లో జలాలు డెడ్‌స్టోరేజికి పడిపోయినా ఈ ప్రాజెక్టు ద్వారా నగరానికి తాగునీరు అందించవచ్చు. కార్యక్రమంలో డైరెక్టర్లు రవి కుమార్, సుదర్శన్, సీజీఎం దశరథ్ రెడ్డి, జీఎం శ్రీధర్ రెడ్డి
పాల్గొన్నారు.