ఖైరతాబాద్, మార్చి 11 : టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కార్మికులపై దమనకాండ సృష్టిస్తున్నారని ఆర్టీసీ మాజీ సెక్యూరిటీ అధికారి దుగ్గు రాజేందర్ ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సజ్జనార్ కార్మికుల మీద చేసిన దమనకాండ ఆర్టీసీ చరిత్రలో ఏ ఎండి కూడా చేయలేదన్నారు. చిన్న చిన్న తప్పులను పెద్దగా చూపెట్టి కావాలనే తొలగించారన్నారు. సుమారు 600 మందిని అనైతికంగా ఉద్యోగాల నుంచి తీసివేశారన్నారు. కనీసం అప్పీలు కూడా చేసుకునేందుకు వీలు లేకుండా చేశారన్నారు.
దీంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అప్పీలు మేళా పెట్టించి సుమారు 200 మందిని తిరిగి ఉద్యోగాల్లో తీసుకున్నారని, కానీ మిగతా 400 మందిని అప్పీలు చేసుకునేందుకు అర్హత కల్పించకపోవడంతో వారు వీధిన పడ్డారన్నారు. వారికి సైతం ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో త్రీమెన్ కమిటీ వేసిందన్నారు. కానీ సజ్జనార్ సబ్ కమిటీ వేయించి మళ్లీ అడ్డుకున్నారన్నారు. సజ్జనార్ తన పదవీ కాలంలో చేసిన అక్రమాలు, అనైతిక పనులకు సంబంధించిన అంశాలతో కూడిన తొమ్మిది పేజీల నివేదిక ప్రధాన మంత్రి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, తెలంగాణ ముఖ్యమంత్రికి పంపించామని, లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశామన్నారు.
బస్టాండ్లలో తమ బంధువులకు చెందిన వారికి వాటర్ బాటిళ్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాడని, 2లక్షల కిలోమీటర్లు తిరిగే అవకాశం ఉన్నా దాన్ని స్కాప్ చేయించి కొత్త బస్సులు కొనుగోలు చేశారని, తద్వారా రెండు వైపులా కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగాల కోసం తాము బస్ భవన్, ప్రజాప్రతినిధులను కలవడానికి వెళితే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారన్నారు. ప్రజావాణికి వెళితే స్పందన లేదని, కనీసం తమను సెక్రటేరియేట్‌లో కూడా అడుగుపెట్టనివ్వడం లేదన్నారు. ఆర్టీసీలో లేని సీవోవో పోస్టును సృష్టించి తనకు తెలిసిన వ్యక్తికి ఇచ్చాడన్నారు. చిన్న చిన్న తప్పులకు తమను తొలగించిన ఎండీ సుమారు వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని, ఆ వివరాలను ప్రధాని, ముఖ్యమంత్రులకు పంపించానన్నారు.
దీనిపై విచారణ జరిపించి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్ అంబిక మాట్లాడు తూ..చిన్న చిన్న తప్పులను సాకుగా చూపుతూ తమను బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించారని, తమ కుటుంబాన్ని వీధిన పడేశారన్నారు. తమ పిల్లలకు కనీసం తిండిపెట్టలేని పరిస్థితిల్లో ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యారు. హన్మకొండ డిపో కండక్టర్ రజిత మాట్లాడుతూ.. ఉద్యోగం కోల్పోవడం వల్ల తమ కుటుంబాలు ఆగమయ్యాయని, ఇళ్లు గడవని పరిస్థితి నెలకొందన్నారు. పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదని, ఇండ్లు కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కండక్టర్ శోభారాణి మాట్లాడుతూ.. తనకు భర్త లేడని, కండక్టర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్నంత పోషించుకుంటున్నానని తెలిపారు. పిల్లలను ఎలా చదివించుకోవాలని, వారికి పెండ్లిళ్లు ఎలా చేయాలని వాపోయారు. ఉరి శిక్ష పడ్డవారికి సైతం క్షమాభిక్ష ఉంటుందని, టికెట్లు కొట్టలేదనో, చిల్లర ఇవ్వలేదనో చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాలు తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.