హయత్‌నగర్, డిసెంబర్ 15: రోడ్డు ప్రమాదంలో ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని చనిపోయింది. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…హయత్‌నగర్ మండలం, వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న యంసాని పాండు కుమార్తె యంసాని ఐశ్వర్య(19) మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నది. కుమార్తెను కళాశాలకు పంపించేందుకు హయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కించడం కోసం తండ్రి పాండు ఆర్టీసీ కాలనీ దగ్గర అవతలివైపు నడుచుకుంటూ రోడ్డును క్రాసింగ్ చేస్తున్నారు.
అదే సమయంలో ఎల్బీనగర్ వైపు నుంచి హయత్‌నగర్ వైపు అతివేగం, అజాగ్రత్తగా దూసుకొచ్చిన కారు రోడ్డును దాటుతున్న తండ్రి కూతురును ఢీకొట్టింది. ఐశ్వర్య అక్కడికక్కడే మృతిచెందింది. తండ్రి పాండుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. ఐశ్వర్య మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. పాండును చికిత్స కోసం హయత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.