చిక్కడపల్లి, సెప్టెంబర్ 26: ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. గురువారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఇకపై స్వతంత్రంగానే కొనసాగుతుందని తెలిపారు. గతంలో ఎస్‌డబ్ల్యూయూ, ఐఎన్టీయూసీ యూనియన్లతో పనిచేశామని, ప్రస్తుతం ఆ యూనియన్లతో పనిచేయడం లేదని తెలిపారు. కార్మికులపై పెంచిన పని భారాన్ని వెంటనే తగ్గించాలన్నారు. అక్రమంగా సస్పెండ్ చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్య ఉపాధ్యక్షుడు టీడీవీకే రావు, ఉపాధ్యక్షుడు ప్రేమ్‌నాథ్, గోలి రవీందర్, స్వాములయ్య, వెంకటేశ్వర్లు, కళ్యాని, ఆర్ఎన్.రావు, అతిక్, పీకే మూర్తి, నాగేంద్ర, రాఖేశ్ తదితరులు పాల్గొన్నారు.