బొల్లారం : నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని, ఆమె వెంటనే మాదిగ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆమె ఇంటిని ముట్టడిస్తామని ఎమ్మార్పీఎస్ కంటోన్మెంట్ ఇన్చార్జి ఇటుక శ్రీ కిషన్ మాదిగ హెచ్చరించారు. బుధవారం బోయిన్ పల్లి మార్కెట్ యార్డ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కుల దురహంకార ధోరణితో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని బర్తరఫ్ చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి వెంటనే మా మాదిగ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, కూల్చిన ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మను తిరిగి అదేచోట పునర్నిర్మించాలని అన్నారు.
అధికార బలంతో అన్యాయంగా ఎమ్మార్పీఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఉపసహరించుకోవాలని అన్నారు. తాను మాదిగ ఓట్లతో జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే అయ్యానని, నేడు ముఖ్యమంత్రిని అయ్యానని ప్రగల్బాలు పలికే రేవంత్ రెడ్డి.. మాదిగలపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార బలంతో తమపై అక్రమ కేసులు పెట్టించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తీరుపై తక్షణమే స్పందించి, మేయర్ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
మేయర్ విజయలక్ష్మి మాదిగలను అవమానించడమే కాకుండా అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించిందని మండిపడ్డారు. వెంటనే విజయలక్ష్మిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నేత అజిత్ కళ్యాణ్, మక్కల అశోక్, నరసింహ, మధుకర్, విష్ణు, వెంకట్, ప్రవీణ్, గిరిబాబు, రమేష్, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.