మైలార్‌దేవ్‌పల్లి : చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తున్నదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని అప్పచెరువులో ఎస్ఎన్డీపి ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న బాక్స్ డ్రైన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.గత వర్షాకాలంలో అప్పచెరువు నిండి చెరువు నీరు ప్రధాన రహదారిలో ప్రవహిస్తూ వాహనదారులకు ఇబ్బందులకు గురిచేసింది.
రెండు సంవత్సరాల క్రితం అప్పచెరువు కట్ట తెగి పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.దీన్ని దృష్టిలో ఉంచుకొని వరద నీరు బయటికి వెళ్లడానికి బాక్స్ డ్రైన్, ఒపెన్ నాలా నిర్మాణానికి జీహెచ్ఎంసీ 8.45 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. 5మీటర్ల వెడల్పుతో 550 మీటర్ల పోడువు నాలా పనులకు శ్రీకారం చుట్టింది.
పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించింది. చెరువు స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని స్థానిక నాయకులు సరికొండ వెంకటేష్ మేయర్‌కు వివరించారు.అనంతరం మేయర్ మాట్లాడుతూ..చెరువులో స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటివారైన సహించేదిలేదని హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని సంబంధిత అధికారులపై మండిపడ్డారు.చెరువు స్థలాన్ని ఆక్రమించిన వారు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నాలా పనులు సకాలంలో పూర్తి చేసి రాబోవు వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
చెరువును సందర్శించిన వారిలో రాజేంద్రనగర్ తాహశీల్దార్ చంద్రశేకర్ గౌడ్ ,జోనల్ కమీషనర్ అశోక్ సామ్రాట్ ,టౌన్ ప్లానింగ్ అధికారి రాణి,జీహెచ్ఎంసీ ఈఈ కిరణ్ ,డిఈ కాశిఫ్ ఉస్సేన్ ,ఎఈ ఫైజల్ ,డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు సరికొండ వెంకటేష్ స్థానికులు ఉన్నారు.