సిటీబ్యూరో/మల్కాజిగిరి, జూలై 12 (నమస్తే తెలంగాణ ): సఫిల్‌గూడ చెరువును సుందరీకరిస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక కార్పొరేటర్ శ్రవణ్‌తో కలిసి మేయర్ సఫిల్‌గూడ లేక్ పార్కును పరిశీలించారు. ఈ పర్యటనకు హాజరు కానీ డీసీ రాజు, ఎంటమాలజీ విభాగం అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీన్‌దయాళ్ కాలనీలో నా లాను పరిశీలించారు. మరోవైపు అక్రమ భవన నిర్మాణాలను ఉపేక్షించొద్దని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు. శుక్రవారం అధికారులతో డెంగీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా శుక్రవారం డ్రై డే నిర్వహించడంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణ, దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీల ప్రజలకు, పాఠశాలల విద్యార్థులకు వర్షాకాలం నిల్వ నీరుతో, ఇంట్లో పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణంతో దోమలు వ్యాప్తి చెంది, వాటి ద్వారా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, విష జ్వరాలు ప్రబలుతాయని చెప్పారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.